పరుగుల వరద పారిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డీసీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 224 పరుగులు చేసింది. ఓ దశలో 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచిన ఢిల్లీని అక్షర్ పటేల్‌తో కలిసి (66; 43 బంతుల్లో, 5x4, 4x6)తో కలిసి రిషభ్ పంత్ (88*; 43 బంతుల్లో, 5x4, 8x6) గొప్పగా ఆదుకున్నాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (26*; 7 బంతుల్లో, 3x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (65; 39 బంతుల్లో, 7x4, 2x6), డేవిడ్ మిల్లర్ (55; 23 బంతుల్లో, 6x4, 3x6) పోరాడారు. రషీద్ ఖాన్ (21*; 11 బంతుల్లో, 3x4, 1x6) మ్యాచ్‌ను దాదాపు గెలిపించేంత పనిచేశాడు. కానీ ఢిల్లీ బౌలర్లు రషీద్‌ను కట్టడిచేశారు. కుల్‌దీప్ యాదవ్ (2/29) పొదుపుగా బౌలింగ్ వేశాడు.

అయితే ఈ క్రమంలో అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ ఫ్రాంచైజీ తరఫున 50+ స్కోరు చేసి, కనీసం ఓ వికెట్ పడగొట్టి అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్‌గా అక్షర్ చరిత్రకెక్కాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్ (66 పరుగులు, 1/28, 3 క్యాచ్‌లు) అందుకున్నాడు. అక్షర్ తర్వాతి స్థానంలో జేపీ డుమిని (54 రన్స్, 4/17, 2 క్యాచ్‌లు.. SRHపై), కాలింగ్‌వుడ్ (53, 1/7, 1 క్యాచ్.. కేకేఆర్‌పై), వీరేంద్ర సెహ్వాగ్ (71, 1/21, 1 క్యాచ్ .. సీఎస్కేపై) ఉన్నారు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు పట్టిన పంత్ రాబిన్ ఉతప్ప రికార్డును బ్రేక్ చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల భాగస్వామ్యంలో నిలిచిన వికెట్ కీపర్ల జాబితాలో పంత్ నాలుగో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోనీ (185), దినేశ్ కార్తీక్ (170), వృద్ధిమాన్ సాహా (112), రిషభ్ పంత్ (92), రాబిన్ ఉతప్ప (90) టాప్-5లో ఉన్నారు.