హైదరాబాద్: టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అక్షర్ పటేల్ కొనుగోలు చేసిన కారు ల్యాండ్ రోవర్ డిస్కవరీ ప్రిమియర్ ఎస్‌యూవీ.
దీని ఖరీదు సుమారు రూ.40 లక్షల నుంచి రూ. 54 లక్షల మధ్యలో ఉంటుంది. గుజరాత్‌కు చెందిన 23 ఏళ్ల అక్షర్ పటేల్ ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌లో ఆడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసి జట్టులో విజయంలో కీలకపాత్ర పోషించాడు.

తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం రాజ్‌కోట్‌లో జరిగిన రెండో టీ20లో అక్షర్‌కు ఒక్క వికెట్ కూడా లభించలేదు. అంతకముందు రెండు వన్డేలు ఆడిన అక్షర్‌కు ఒక్క వికెట్ మాత్రమే దక్కింది.
ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంక పర్యటనలో ఉన్న హార్దిక్ పాండ్యా స్వదేశంలో ఉన్న తండ్రికి కారు కొనిచ్చి సర్‌ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కార్లు అంటే పిచ్చి. కోహ్లీ వద్ద ఆడీ ఎస్6, ఆడీ ఏ8-ఎల్, ఆడీ క్యూ7, ఆడీ ఆర్8, ఆడీ ఆర్8 ఎల్‌ఎమ్‌ఎక్స్, ఆస్టన్ మార్టిన్ డీబీఎస్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.