
క్వీన్స్‌లాండ్: భారత మహిళల క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆడుతున్న డే అండ్ నైట్ టెస్టులో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అదరగొట్టింది. దూకుడైన బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిన మంధాన.. కెరీర్‌లో తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసింది. అంతేకాదు ఓ అరుదైన రికార్డును కూడా నెలకొల్పింది. డే అండ్ నైట్ టెస్టులో సెంచరీ సాధించిన మొదటి భారత మహిళా క్రికెటర్‌గా మంధాన నిలించింది. 216 బంతుల్లో 127 పరుగులు చేసిన మంధాన.. చివరకు యాష్లే గార్డెనర్ బౌలింగ్‌లో ఔటయింది. మంధాన ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, ఓ సిక్సు ఉంది.
డే అండ్ నైట్ టెస్టులో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ స్మృతి మంధాన పరుగుల వరద పారించింది. ఆఫ్ సైడ్‌లో భారీ షాట్లు కొట్టిన మంధాన.. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ బౌండరీల వర్షం కురిపించింది. గులాబి బంతితో ఆడడం ఇదే తొలిసారి అయినా గొప్ప పోరాట పటిమను ప్రదర్శించింది. మొదటి రోజు వర్షం అంతరాయం కలిగించినా.. పట్టుదలతో క్రీజులో నిలిచి టీమిండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. భారత్ ఇప్పటివరకు పింక్ బాల్‌తో ఆడిన సందర్భాలు లేవు. అందులోనూ ఆస్ట్రేలియా లాంటి పటిష్ట జట్టుతో ఆడటం పెద్ద సవాలు. వీటిని అదిగమించి స్మృతి మంధాన అద్భుతంగా రాణించి సెంచరీ చేసింది. భారత్ తరఫున డే అండ్ నైట్ టెస్టులో ముందుగా సెంచరీ చేసింది విరాట్ కోహ్లీ. 2019లో బంగ్లాపై విరాట్ శతకం బాదాడు.
చివరిసారిగా 2006లో భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్లు టెస్టులో తలబడ్డాయి. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు టెస్టు మ్యాచ్ ఆడుతున్నాయి. కెప్టెన్ మిథాలీ రాజ్, వెటరన్ పేసర్ జులన్ గోస్వామి అప్పటి మ్యాచ్ ఆడారు. ఇప్పుడు వీళ్లిద్దరితో ఆడుతున్న వాళ్లంతా కొత్తవాళ్లే. భారత్‌కు ఈ ఏడాది ఇది రెండో టెస్టు. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఏకైక టెస్టులో భారత్ చక్కని పోరాటస్ఫూర్తి కనబరిచింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో బరిలోకి దిగింది. మరోవైపు ఆస్ట్రేలియా 2019లో యాషెస్ సిరీస్ ఆడాక మళ్లీ టెస్టులే ఆడలేదు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటివరకు 9 టెస్టులు జరిగాయి. ఆస్ట్రేలియా 5 టెస్టుల్లో గెలుపొందగా.. నాలుగు డ్రాగా ముగిశాయి. భారత్ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది.
ఈ మ్యాచులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మ (64 బంతుల్లో 31) శుభారంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. పటిష్టమైన పేస్ బలగమున్న ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని అలరించారు. అయితే 25 ఓవర్లో మోలినెక్స్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడిన షెఫాలీ.. మెక్ గ్రాత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన పూనమ్ రౌత్ చక్కటి సహకారాన్ని అందించింది. దాంతో మంధాన ఫోర్ల సునామి సృష్టించింది. మంధాన దాటికి ఆసీస్ బౌలర్ డార్సీ బ్రౌన్ భారీగా పరుగులు సమర్పించుకుంది. ప్రస్తుతం భారత్ మూడు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మిథాలీ రాజ్ (25), యాస్తికా భాటియా (18) ఉన్నారు. అంతకు ముందు మొదటి రోజు ఆట వర్షార్పణం అయింది.