
భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీసులో ఆస్ట్రేలియా జట్టు తీసుకున్న షాకింగ్ నిర్ణయాల్లో ట్రావిస్ హెడ్‌ను పక్కన పెట్టడం ఒకటి. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో ట్రావిస్ హెడ్‌ను ఆడించకుండా మాట్ రెన్‌షాను ఆసీస్ తీసుకుంది. అయితే ఈ ఎత్తుగడ ఆసీస్‌నే దెబ్బతీసింది. రెన్‌షా చాలా ఘోరంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్సుల్లో చాలా స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరాడు. అయితే రెండో టెస్టులో మాత్రం ట్రావిస్ హెడ్‌ను ఆడించారు.
ఈ క్రమంలో తొలి టెస్టులో తనను ఆడించకపోవడంపై హెడ్ స్పందించాడు. జట్టులోకి తీసుకోకపోవడం గురించి తనకు కన్విన్సింగ్ వివరణ ఇచ్చారని హెడ్ వివరించాడు. 'ఇక్కడకు వచ్చేటప్పుడు ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. ఒక్కోసారి ఇలా జరుగుతుంది. వాళ్లు చెప్పిన విషయాలు కరెక్ట్‌గా ఉన్నాయి. అందరికీ వేరు వేరు ఒపీనియన్స్ ఉంటాయి. కోచ్‌లు, సెలెక్టర్లను నేను చాలా గౌరవిస్తా. వాళ్లతో నా అనుబంధం కూడా చాలా బలంగా ఉంది' అని చెప్పాడు.
'రెండు వైపులా గౌరవం ఉండటం వల్లనే మా కన్వర్జేషన్లు ఇలా జరిగాయని అనుకుంటున్నా. మా అభిప్రాయాలను మేం చక్కగా చెప్పుకోగలిగాం. ఆ తర్వాతి రోజు నేను మామూలుగానే నిద్రలేచా. భారత పర్యటనలో ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నా. నాకు ఇష్టమైన పని చేయగలుగుతున్నా. ఇప్పటికీ నేను అద్భుతమైన ప్లేస్‌లో ఉన్నాననే అనుకుంటున్నా. ఆ ఒక్క వారమే నేను అనుకున్నట్లు జరగలేదు అంతే' అని ట్రావిస్ హెడ్ అభిప్రాయపడ్డాడు. రెండో టెస్టులో ట్రావిస్ హెడ్ ఫర్వాలేదనిపించాడు.
ఢిల్లీ టెస్టులో తొలి ఇన్నింగ్సులో 12 పరుగులు మాత్రమే చేసిన అతను.. రెండో ఇన్నింగ్సులో 43 పరుగులతో రాణించాడు. గతేడాది ఆస్ట్రేలియా తరఫున అద్భుతంగా రాణించిన అతన్ని తొలి టెస్టులో పక్కన పెట్టడం చాలా విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ఇండోర్ వేదికగా జరిగే మూడో వన్డేలో మాత్రం ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా బరిలో దిగనున్నాడు. డేవిడ్ వార్నర్ గాయంతో జట్టుకు దూరం అవడంతో ఉస్మాన్ ఖవాజాతో కలిసి అతనే ఓపెనింగ్ బాధ్యతలు పంచుకుంటాడు.