'కోహ్లీ ఓ ఉన్మాది అహం ఎక్కువ, చిన్నపిల్లాడి మనస్తత్వం'
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మీడియా బుధవారం తీవ్ర విమర్శలు చేసింది. కోహ్లీ 'క్లాస్ లెస్' ఆటగాడని.. అతను చిన్నపిల్లాడికంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడని తమ కథనాల్లో రాసుకొచ్చాయి. నాలుగో టెస్టు విజయానంతరం ఆస్ట్రేలియాకు చెందిన పలు మీడియా సంస్థలు కోహ్లీపై దుమ్మెత్తిపోశాయి.

2-1తో సిరిస్ కైవసం
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకున్న తర్వాత కోహ్లీ మీడియాతో ఆస్ట్రేలియన్లు ఇకపై తన స్నేహితులు కారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ధర్మశాల టెస్టు విజయానంతరం కోహ్లీ మాట్లాడిన తీరు వల్ల అతన్ని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇకపై స్నేహితుడిగా చూడరని రాసుకొచ్చాయి.

చిన్నపిల్లాడిని తలపించిన కోహ్లీ మనస్తత్వం
ఇక సిరీస్ విజయానంతరం కోహ్లీ కరచాలనం చేయకపోవడం చిన్నపిల్లాడిని తలపించిందని, కోహ్లీకి అహం ఎక్కువని సిడ్నీ నుంచి వెలువడే డైలీ టెలిగ్రాఫ్ ఆరోపించింది. కోహ్లీ ఓ ఉన్మాది అని కూడా వ్యాఖ్యానించింది. చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మురళీ విజయ్‌పై నోరు పారేసుకున్న స్టీవ్ స్మిత్ క్షమాపణలు చెప్పాడని, కోహ్లీ కూడా ఆస్ట్రేలియన్ క్రికెటర్లకు క్షమాపణ చెప్పాలని హెరాల్డ్ సన్ పత్రిక జర్నలిస్ట్ రసెల్ వ్యాఖ్యానించాడు.

కోహ్లీని లక్ష్యం చేసుకుని తీవ్ర విమర్శలు
నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా ఆస్ట్రేలియా మీడియా కోహ్లీని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కోహ్లీపై విమర్శల విషయంలో నియంత్రణ కోల్పోతున్నారంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సూచించినా ఆసీస్ మీడియా వెనక్కి తగ్గకపోవడం విశేషం.

రహానేను బీర్ పార్టీకి పిలిచిన కెప్టెన్ స్టీవ్ స్మిత్
ఇదిలా ఉంటే సిరిస్ విజయానంతరం బీర్ పార్టీకి రావాలని ఆసీస్ కెప్టెన్ స్మిత్.. తాత్కాలిక కెప్టెన్ రహానేను కోరగా అందుకు రహానే అంగీకరించకపోవడాన్ని కూడా ఆస్ట్రేలియా మీడియా తప్పుపట్టింది. కాగా నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 2-1తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications