ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025)లో పంజాబ్ ఈసారి దుమ్ము దులుపుతోంది. గత టోర్నీలకు భిన్నంగా దూకుడైన ప్రదర్శనతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది. ఆడిన 11 మ్యాచ్ ల్లో ఏడు మ్యాచ్ లు గెలిచి 14 పాయింట్లతో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ ఇప్పుడు టైటిల్ పోటీ దారుల్లో ఒకటిగా నిలిచింది. అయితే పంజాబ్ సాధిస్తున్న విజయాల్లో కీలకంగా ఉన్న ఓ యువ బ్యాటర్ ఇప్పుడు దిగ్గజ క్రికెటర్ల దృష్టిలో పడుతున్నాడు.
పంజాబ్ కింగ్స్ జట్టు విజయాల్లో కీలకంగా మారిన యువ బ్యాటర్ ప్రభ్ సిమ్రన్ గురించి ఇప్పుడు ఐపీఎల్ టోర్నీలో అంతా చర్చించుకుంటున్నారు. తాజాగా నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ లోనూ పంజాబ్ బ్యాటర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 48 బంతుల్లోనే 91 పరుగులతో దుమ్మురేపాడు. ఇందులో 7 సిక్సర్లు , 6 ఫోర్లు ఉన్నాయి. ప్రభ్ సిమ్రన్ దూకుడుతో పంజాబ్ ఏకంగా 236 పరుగులు చేయగలిగింది. దీంతో ఈ యువ క్రికెటర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఈసారి ఐపీఎల్ లో ప్రభ్ సిమ్రన్ దూకుడుపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతన్ని 2010లో యువకుడైన మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న లక్షణాలే ప్రభ్‌సిమ్రాన్‌కు ఉన్నాయని హేడెన్ విశ్లేషించాడు. అప్పట్లో ధోనీ కూడా తన సిక్స్ లు కొట్టే సామర్ధ్యంతో ఇలాగే అందరినీ ఆశ్చర్యపరిచేవాడని హేడెన్ తెలిపాడు. 2010 ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై ధోని 29 బంతుల్లో 54 నాటౌట్‌గా నిలిచి సంచలనం సృష్టించిన విషయాన్ని హేడెన్ గుర్తు చేశాడు. అప్పుడు ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ లో హేడెన్ ఓపెనర్ గా ఉన్నాడు.
అద్భుతమైన బ్యాటింగ్ వేగం, దృఢమైన బేస్ ప్రభ్ సిమ్రన్ బ్యాటింగ్ లో ఉందని హేడెన్ తెలిపాడు. ఎత్తుగా లేకపోవడం కూడా ప్రభ్ సిమ్రన్ కు ఖాళీలలోకి బంతిని పంపేందుకు పనికొస్తుందన్నాడు. లక్నోతో మ్యాచ్ లో అతని ఆటతీరును హేడెన్ ప్రశంసించాడు. అతను పూర్తి కంట్రోల్ లో ఉన్నాడని, బౌలర్లను తప్పులు చేసే దిశగా పురికొల్పాడని వెల్లడించాడు. తద్వారా తన క్లాస్ ను మరోసారి నిరూపించుకున్నాడన్నారు.