హైదరాబాద్: భారత ఉపఖండంలో క్రికెట్ ఆడాలంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లు వణికిపోతారు. ఇక్కడి స్పిన్ పిచ్లే కాదు.. ఇక్కడి ఎండ వేడిమిని కూడా వాళ్లు తట్టుకోలేరు. ఉపఖండం వాతావరణానికి అలవాటు పడేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమి, ఉక్కపోతకు సతమతం అవుతున్నారు.
తాజాగా బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇది మరోసారి నిరూపితమైంది. ఈ మ్యాచ్‌లో రెండో రోజు కేవలం రెండున్నర గంటలు బ్యాటింగ్ చేసిన హ్యాండ్స్కోంబ్ ఏకంగా 4.5 కిలోల బరువు తగ్గాడు. మ్యాచ్ జరుగుతున్న చిట్టగాంగ్‌లో విపరీతమైన వేడి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.
మాటిమాటికీ డ్రింక్స్ బ్రేక్ తీసుకుంటూ అలసటకు గురయ్యాడు. శీతల పానీయాలు పుచ్చుకుంటూ శరీరంలో నీటిశాతం తగ్గకుండా జాగ్రత్తపడ్డాడు. చివరకు 82 పరుగులు చేసిన రనౌటయ్యాడు. ఆ తర్వాత వెళ్లి బరువు చూసుకుంటే.. 4.5 కిలోలు తగ్గాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఐస్‌బాత్ చేశాడు.
నిజానికి భారత ఉపఖండ వాతావరణంతో ఇబ్బంది పడటం ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఇదేమీ కొత్త కాదు. 1986లో అప్పటి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్ కూడా చెన్నై టెస్టు సందర్భంగా ఇలాగే తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అలాగే చెమటలు కక్కుతూ ఆ టెస్టులో అతడు డబుల్ సెంచరీ చేయడం విశేషం.