భద్రతా కారణాల దృష్యా ఇతర దేశాలకు చెందిన జట్లు ఏవి కూడా చాలా కాలంగా పాకిస్థాన్‌లో పర్యటించడం లేదు. కొంతకాలం క్రితం న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాకిస్థాన్‌లో పర్యటించేందుకు సిద్ధమైనప్పటికీ తర్వాత మళ్లీ మనసు మార్చుకోని పర్యటనను విరమించుకున్నాయి. దీంతో అప్పుడు పాకిస్థాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల వెస్టిండీస్ వంటి జట్లు పాకిస్థాన్‌లో పర్యటించినప్పటికీ కరోనా దెబ్బ కొట్టింది. అయితే తాజాగా పాకిస్థాన్ అభిమానులను సంతోషపరిచే వార్త ఒక్కటి బయటికి వచ్చింది. 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో పాకిస్థాన్‌లో పర్యటించేందుకు సిద్ధమైంది. పాకిస్థాన్ పర్యటనలో ఆస్ట్రేలియా మూడు టెస్టు మ్యాచ్‌లు, ఒక టీ20, 3 వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే రెండున్నర దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌కు వస్తుండడంతో ఈ పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సీనియర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఈ పర్యటనపై స్పందించాడు. 24 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వస్తున్న ఆస్ట్రేలియాకు స్వాగతం పలికేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అలాగే సిరీస్ కోసం తాను చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. తనతోపాటు తమ టీం కూడా సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు. ఇటీవల కొన్ని జట్లు అనవసర కారణాలతో పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నాయని, దీంతో తమ క్రికెట్ బోర్డు ఆర్థికంగా నష్టపోయిందని రిజ్వాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయా జట్ల నిర్ణయంతో తమ అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ చెందారని తెలిపాడు.
ఈ సిరీస్ ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత మెరుగు పరుస్తుందని రిజ్వాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఉస్మాన్ ఖవాజా వంటి ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇప్పటికే పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నారని చెప్పాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టేంట్గా కూడా వ్యవహరించాడని గుర్తు చేశాడు. అలాగే పాకిస్థాన్ ఆటగాళ్లు షాదాబ్ ఖాన్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్‌లు ఆస్ట్రేలియాకు చెందిన బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుతున్నారని తెలిపాడు. ఇవన్నీ కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పరిచాయని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.
కాగా ఆస్ట్రేలియా.. పాకిస్థాన్ పర్యటన విజయవంతం అయితే మరిన్ని జట్లు అక్కడ పర్యటించే అవకాశం ఉంది. అలాగే భారత్, పాకిస్థాన్ మధ్య చాలా కాలంగా ఎటువంటి సిరీస్‌లు జరగని సంగతి తెలిసిందే.