
హైదరాబాద్: బౌన్సర్ తలను బలంగా తాకడంతో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషాద సంఘటన జరిగిన నేటికి (సోమవారం) మూడేళ్లు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా జట్టుకు చెందిన పలువురు క్రికెటర్లు అతడికి ఘనంగా నివాళులు అర్పించారు.
మరికొందరు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా అతడిని స్మరించుకున్నారు. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో గబ్బా స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టులో అతడి గుర్తుగా ఆసీస్ క్రికెటర్లు చేతికి బ్లాక్ బ్యాండ్ ధరించారు.
అంతేకాదు... ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు మైదానంలో అభిమానులు, ఆటగాళ్లు, సిబ్బంది నిలబడి మౌనం పాటించారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 63 పరుగులు చేయగానే ఆకాశం వైపు చూస్తూ తన మిత్రుడికి నివాళి అర్పించాడు. వార్నర్ అలా చేయడానికి కారణం ఉంది.
బౌన్సర్ హ్యూస్ తలను తాకినప్పుడు అతడు క్రీజులో 63 పరుగులతో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరుపున అరంగేట్రం చేసిన 408వ టెస్టు ఆటగాడు. దీంతో ఆసీస్ క్రికెటర్లు తమ ట్విట్టర్ ఖాతాల్లో 408 నెంబర్‌తో ట్వీట్ చేశారు. ఆసీస్ తరుపున హ్యూస్ 26 టెస్టు మ్యాచ్‌లాడాడు.