

హైదరాబాద్: ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ (మహిళల డివిజన్) మ్యాచ్‌లో వింత రికార్డు నమోదైంది. జట్టులో ఒక్కరు మాత్రమే ఖాతా తెరిచారు.. మిగతా పది మంది డకౌటయ్యారు.. ఆ ఒక్కరు చేసిన పరుగులు నాలుగు మాత్రమే. మిగతావన్నీ ఎక్స్‌ట్రాలే కావడం విశేషం.
'నేషనల్ ఇండిజినస్ క్రికెట్ చాంపియన్‌షిప్'లో భాగంగా న్యూ సౌత్ వేల్స్‌తో మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా అత్యల్పంగా 10 పరుగుల స్కోరు నమోదు చేసింది. ఇందులో ఓపెనర్ మాన్సెల్ (33 బంతుల్లో 4) మాత్రమే పరుగులు చేయగలిగింది. మిగతా పది మంది 'సున్నా'కే పరిమితమయ్యారు.
పది మంది ఖాతానే తెరవకున్నా.. దక్షిణ ఆస్ట్రేలియా జట్టు 10.2 ఓవర్లు ఆడటం విశేషం. ఆ జట్టులో మాన్సెల్ 33 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసింది. ఎక్స్‌ట్రాలుగా వచ్చిన 6 పరుగులే జట్టు ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్ కావడం విశేషం. ప్రత్యర్థి బౌలర్లు 'వైడ్'ల ద్వారా ఈ అదనపు పరుగులు ఇచ్చారు.
న్యూసౌత్ వేల్స్ బౌలర్ రాక్సాన్నె వాన్ వీన్ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టింది. నవోమి వుడ్స్ వేసిన రెండు బంతుల్లో వికెట్లు తీసుకుంది. అనంతరం న్యూసౌత్‌వేల్స్ 2.5 ఓవర్లలో 2 వికెట్లకు 11 పరుగులు చేసి విజయం సాధించింది.