
ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారు కావడంతో అంతా వేలం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వేలంలో ఎవరెవరు ఉండున్నారనేది ఆసక్తిగా మారింది. భారత ఆటగాళ్లపై ఓ క్లారిటీ ఉన్నప్పటికీ విదేశాలకు చెందిన ఆటగాళ్లు ఎవరెవరు వేలంలో పాల్గొంటున్నారో తెలియాల్సి ఉంది. తాజాగా ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ వేలంలో తన పేరును ఉంచే ఆలోచనలో ఉన్నాడు. ఐపీఎల్ కోసం ఇప్పటికే ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టాడు. దీంతో ఈ సీజన్ ఐపీఎల్ మెగా వేలంలో మిచెట్ స్టార్క్ పాల్గొనడం ఖాయంగా కనిపిస్తోంది.
కాగా మంచి పేస్ బౌలర్ అయినా మిచెల్ స్టార్క్ గతంలో ఐపీఎల్‌లో ఆడాడు. 2014, 2015 సీజన్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో 27 మ్యాచ్‌లు ఆడాడు. 34 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. అయితే పలు కారణాలతో 6 సంవత్సరాలుగా స్టార్క్ ఐపీఎల్‌లో ఆడడం లేదు. ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌లో పాల్గొనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే వేలానికి సిద్ధమవుతున్నాడని సమాచారం.
కాగా ఐపీఎల్ మెగా వేలాన్ని ఫిబ్రవరి 13, 14వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మంగళవారం వెల్లడించారు. బెంగళూరు వేదికగా వేలాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఈ నెల 31 వరకు కొత్త జట్లు అయినా లక్నో, అహ్మదాబాద్ తమ రిటెన్షన్ ఆటగాళ్లను ఎంచుకోవాలని ఆ జట్లకు బీసీసీఐ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
కాగా 2011 తర్వాత ఈ సారి ఐపీఎల్ 10 జట్లతో జరగనుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా ఏప్రిల్‌లోనే ఐపీఎల్ ప్రారంభంకానుంది. అయితే కరోనా విజృంభణ కారణంగా ఒకే వేదికపై ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందుకోసం ముంబైలోని వాంఖడే స్టేడియాన్ని ఎంచుకుంది. ఒక వేళ అది కూడా సాధ్యం కాకపోతే యూఏఈ వేదికగా టోర్నీని నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉంది. కరోనా కారణంగా 2021లోని సగం ఐపీఎల్ బీసీసీఐ యూఏఈలోనే నిర్వహించింది. అంతకుముందు ఏడాది 2020 ఐపీఎల్ పూర్తి లీగ్ యూఏఈ వేదికగానే జరిగిన సంగతి తెలిసిందే.