రీసెంట్ గా ముగిసిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో స్టార్ ప్లేయర్లతో గొడవపడి, దూకుడు ఆట కనబరిచిన ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్.. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు . తన కుటంబం మొత్తం విరాట్ ను ఎంతో ఇష్టపడుతుందని అన్నాడు. కోహ్లీ గొప్ప వ్యక్తి అని కొనియాడాడు. ఇంకా ఏమన్నాడంటే?
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌తో సామ్ కొన్‌స్టాస్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తానాడిన తొలి టెస్టులోనే కోహ్లీ, బుమ్రాతో దూకుడుగా వ్యవహరించి క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు కొన్ స్టాస్. ఆ తర్వాత సిడ్నీ టెస్టులోనూ అదే తీరును ప్రదర్శించి బుమ్రాతో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు.

అయితే ఇప్పుడు గావస్కర్ ట్రోఫీ ముగిశాక తాను చేసిన తప్పిదాలపై మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీతో జరిగిన వివాదంపై కూడా స్పందించాడు. విరాట్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. "కోహ్లీనే నా దేవుడు. అతడే నాకు స్ఫూర్తి. నేను అతడిని నా యుక్త వయసు నుంచే ఆరాధిస్తాను. నా కుటుంబం మొత్తం అతడిని అభిమానిస్తుంది. క్రికెట్ లో అతడు లెజెండ్. నేను తన పేరును జపించడాన్ని ఇష్టపడతాను. అతడితో కలిసి ఆడటం నాకు దక్కిన గొప్ప గౌరవం. విరాట్ కోహ్లీ అంత పెద్ద స్టార్ అయినా ఎంతో ఒదిగి ఉంటాడు. లవ్లీ పర్సన్. ఆట పూర్తయ్యాక నేను కాసేపు తనతో మాట్లాడాను." అని పేర్కొన్నాడు.
అంతకుముందు బుమ్రాతో జరిగిన గొడవ గురించి కూడా మాట్లాడాడు కొన్ స్టాస్. " ఇది నా తప్పే. అయితే క్రికెట్ అన్నాక ఇలాంటివి జరుగుతాంటాయి." అని చెప్పుకొచ్చాడు.
కాగా, త్వరలోనే శ్రీలంకలో ఆస్ట్రేలియా రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆడనుంది. జనవరి 29 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ కోసం తనను ఎంపిక చేస్తారో లేదో తెలీదని చెప్పిన కొన్ స్టాస్, ఒకవేళ తాను సెలెక్ట్ అయితే మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు.