
అదిరే ఆరంభం:
133 పరుగుల సాధారణ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు అలిసా హీలీ, బెత్ మూనీలు ఆచితూచి ఆడుతూ 33 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నెలకొల్పారు. హీలీ ధాటిగా ఆడగా.. ఆమెకు మూనీ అండగా నిలిచింది. అయితే పేసర్ శిఖ పాండే బౌలింగ్‌లో మూనీ (6, 12 బంతుల్లో) షాట్‌కు యత్నించి రాజేశ్వరి గైక్వాడ్ చేతికి చిక్కింది. దీంతో 6 ఓవర్లకు ఆసీస్ వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.

హీలీ హాఫ్ సెంచరీ:
కెప్టెన్ మెగ్ లానింగ్ (5) అండతో హీలీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపింది. ఈ సమయంలో రాజేశ్వరి గైక్వాడ్ ఓ అద్భుత బంతితో లానింగ్‌ను బోల్తా కొట్టించింది. అయితే హీలీ ధాటిగా ఆడడంతో ఆసీస్ విజయం దిశగా పయనిస్తున్నట్టు కనిపించింది. పూనమ్ యాదవ్ బౌలింగ్‌లోకి దిగాక ఆట స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఆస్ట్రేలియా వరుసపెట్టి వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో పడింది. అర్ధ సెంచరీ చేసి జోరుమీదున్న హీలీని పూనమ్ ఔట్ చేసి టీమిండియాకు ఊరటను ఇచ్చింది.

పూనమ్ మాయాజాలం:
పూనమ్ దెబ్బకు రేచల్ హేన్స్ (6), ఎలీస్ పెర్రీ (0), జెస్ జొనాసెన్ (2)లను పెవిలియన్ బాట పట్టారు. దీంతో ఆసీస్ ఒక్కసారిగా వెనుకబడిపోయింది. ఇక్కడే భారత్ పైచేయి సాధించింది. అయితే గార్డనర్ క్రీజులో ఉండి భారీ షాట్లు ఆడింది. ఈ సమయంలో శిఖా పాండే అన్నాబెల్ సదర్లాండ్ (2)ను ఔట్ చేయగా.. డెలిస్సా కిమ్మిన్స్ (4) రనౌట్ అయింది. ఇక చివరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సి ఉండగా.. భారీ షాట్ ఆడిన గార్డనర్ క్యాచ్ ఔట్ అయింది. భారత్ ఘన విజయం సాదించింది.

ఆదుకున్న దీప్తి శర్మ:
అంతకుముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. టాపార్డర్ పూర్తిగా విఫలమయినా దీప్తి శర్మ (49; 46 బంతుల్లో 3 ఫోర్లు) ఆదుకుంది. ఓపెనర్ షెఫాలీ వర్మ (29; 15 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) ఓ మోస్తారుగా మెరుపులు మెరిపించింది. ఆసీస్ బౌలర్లలో జెస్ జోనాసెన్ రెండు వికెట్లతో రాణించింది.