
హైదరాబాద్: మేమంతా పెద్ద వాళ్లమే. మాకు ఎలాగ ఆడాలో తెలుసంటూ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా స్టంప్ మైక్రోఫోన్లు ఆపేయాలని ఆస్ట్రేలియా జట్టు కోరుతోంది. ఏ చిన్న భావోద్వేగానికి గురైన మైదానంలో తిట్లు కామన్‌గా కనిపిస్తూనే ఉంటాయి. ఈ మధ్యే భారత జట్టు ఆటగాళ్లకు సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి.
ధోనీ పాండేను తిడుతున్న వీడియో, ధోనీ వికెట్ల నుంచి బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి బాల్ వేయాలని బౌలర్లకు సూచిస్తున్న వీడియోలతో పాటు పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు బూతులు కూడా వీటిలో వినిపిస్తూ ఉంటాయి. కానీ, అవి వద్దంటూ ఆస్ట్రేలియా జట్టు కోరుతోంది.
'మైదానంలో ఏం జరిగినా అది మైదానానికే పరిమితమవుతుంది. మేమంతా పెద్దవాళ్లమే. తీవ్రంగా పోరాడతాం. మాకు హద్దులు తెలుసు. ఎప్పుడూ హద్దులు దాటం'' అని ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ అన్నాడు. ''ఇది శారీరక క్రీడే కాదు, మానసిక క్రీడ కూడా. రెండు జట్ల ఆటగాళ్లూ నోటికి పనిచెబుతారు. ఈ సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయం'' అని చెప్పాడు.
ఆస్ట్రేలియాలో బంతి ప్లేలో ఉన్నప్పుడు మాత్రమే శబ్దాన్ని రికార్డు చేయడానికి స్టంప్ మైక్రోఫోన్లు వాడతారు. డెలివరీల మధ్య అవి పనిచేయవు. కానీ దక్షిణాఫ్రికాలో మాత్రం మైక్రోఫోన్లు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. నిరుడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను బూతులు తిడుతూ మైక్రోఫోన్లకు దొరికిపోయిన దక్షిణాఫ్రికా పేసర్ రబాడ.. ఓ టెస్టు మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో తీవ్ర స్థాయి మాటల యుద్ధం మధ్య జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 4-0తో గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో గురువారం ఆరంభమైన సిరీస్‌లో అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఆసీస్ ఉంది.