ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ పాకిస్థాన్ మరోసారి తడబడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 227 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. అయితే ఆ జట్టు స్కోరు ఇంత వరకు అయినా వచ్చిందంటే వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ (88; 103 బంతుల్లో) పోరాటమే.
ఖాతా తెరవకుండానే ఓపెనర్లు అబ్దుల్లా షఫికి, సయిమ్ అయుబ్ పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత వచ్చిన బాబర్ అజామ్ (26) , సౌద్ షకీల్ (5) కూడా విఫలమవ్వడంతో 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రిజ్వాన్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డు పెంచాడు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న అతడిని కమిన్స్ ఔట్ చేశాడు.

అయితే SENA దేశాల్లో పాక్ కష్టాల్లో ఉన్న ఎన్నోసార్లు ఆపద్బాంధవుడిగా రిజ్వాన్ నిలివడం విశేషం. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో బ్యాటింగ్ అంత సులువు కాదు. బౌలర్లు చెలరేగుతుంటారు. కానీ పాక్‌ను రిజ్వాన్ ఆదుకున్నాడు. గతంలో ఆస్ట్రేలియాలో 94 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినప్పుడు.. రిజ్వాన్ 95 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌లో 120/5; 75/5 తో కష్టాల్లో ఉన్నప్పుడు వరుసగా 72, 53 పరుగులు చేశాడు.
అలాగే న్యూజిలాండ్‌లో పాకిస్థాన్ కష్టాలు ఉన్నప్పుడు కూడా రిజ్వాన్ ఆదుకున్నాడు. 52/5; 74/4; 83/4 స్కోర్లతో పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు రిజ్వాన్ వరుసగా 71, 60, 61 పరుగులు చేశాడు. ఇప్పుడు మరోసారి సిడ్నీ టెస్టులో జట్టుకు అండగా నిలిచాడు. రిజ్వాన్ ప్రదర్శనపై నెటిజన్లు కొనియాడుతున్నారు. రిజ్వాన్ మంచి యాక్టర్ మాత్రమే కాదు, పాకిస్థాన్‌కు ఆపద్బాంధవుడు అని ప్రశంసిస్తున్నారు.
ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్ తిమ్మిర్లతో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అయితే కాస్త అతిగా బాధ పడినట్లుగా క్రీజులో ప్రవర్తించాడు. ఈ విషయంపై మ్యాచ్ అనంతరం అడిగితే కొంచెం నొప్పి, కొంచెం నటన కూడా అని రిజ్వానే స్వయంగా చెప్పడం గమనార్హం.