సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా-పాకిస్థాన్ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 116/2తో మూడో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్ 299 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 313 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అయితే 14 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్‌ను ఆసీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. హేజిల్ వుడ్ ధాటికి మూడో రోజు ఆట ముగిసేసరికి పాకిస్థాన్ 68/7తో కష్టాల్లో నిలిచింది.
మూడో రోజు ఆటను ప్రారంభించిన లబుషేన్ (60), స్టీవ్ స్మిత్ (38) జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో లబుషేన్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే పాక్ బౌలర్లు పుంజుకుని ఒకే ఓవర్ వ్యవధిలో స్మిత్, లబుషేన్‌ను పెవిలియన్‌కు చేర్చారు. కాపేపటికే ట్రావిస్ హెడ్ (10)ను కూడా ఔట్ చేశారు. కానీ మిచెల్ మార్ష్ (54), క్యారీ (38) కీలక పరుగులు సాధించారు. పాకిస్థాన్ బౌలర్లలో అమీర్ జమాల్ ఆరు వికెట్లతో సత్తాచాటాడు. సల్మాన్ రెండు, సజిద్, హంజా చెరో వికెట్ తీశారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్‌కు స్టార్క్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. తోలి ఓవర్‌లోనే ఓపెనర్ షఫికీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్‌లో కెప్టెన్ షాన్ మసూద్‌ను హేజిల్‌వుడ్ డకౌట్ చేశాడు. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్ అజామ్ (23).. మరో ఓపెనర్ సయిమ్ అయుబ్ (33)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ అయుబ్‌ను లయాన్, బాబర్‌ను హెడ్ ఔట్ చేయడంతో 60 పరుగులకే పాక్ నాలుగు వికెట్లు కోల్పోయింది.

అయితే బాబర్ ఔటైన కాసేపటికే 67 పరుగుల వద్ద పాకిస్థాన్ మూడు వికెట్లు కోల్పోయింది. హేజిల్‌వుడ్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్ల పడగొట్టి పాక్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు.షకీల్ (2), సజిద్ ఖాన్ (0), సల్మాన్ (0) వరుసగా పెవిలియన్‌కు చేరారు. క్రీజులో మహ్మద్ రిజ్వాన్ (6), అమీర్ జమాల్ ఉన్నారు. అయితే స్వల్ప వ్యవధిలోనే నాలుగు వికెట్లు పాక్ కోల్పోవడంతో నెటింట్లో ట్రోల్స్ వస్తున్నాయి. ''తన జట్టు ప్లేయర్లతో బాబర్ అజామ్.. కొంచెం టైమ్ తీసుకొని ఔట్ అవ్వండ్రా'' అని అభ్యర్థిస్తున్నట్లూ మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.