హైదరాబాద్: పాకిస్థాన్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. సిడ్నీ వేదికగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 220 పరుగుల తేడాతో భారీ విజయం సాధించించింది. దీంతో మూడు టెస్టుల మ్యాచ్ సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
1999 నుంచి ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్ ఇలా వైట్ వాష్ కావడం నాలుగో సారి. 465 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ చేధనలో చతిలకిలబడింది. 55/1 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజైన శనివారం ఆటను కొనసాగించిన పాకిస్థాన్ 80.2 ఓవర్లలో 244 పరుగులకే ఆలౌటైంది.

ఓవర్ నైట్ ఆటగాళ్లు అజహర్ అలీ(11), యాసిర్ షా(3)లను ఆదిలోనే పెవిలియన్‌కు పంపడంతో ఆస్ట్రేలియా విజయం ఖరారైంది. అనంతరం మిస్బావుల్ హక్(38), అసద్ షఫిక్(30)లు రాణించినా ప్రయోజనం లేకపోయింది. సర్ఫరాజ్ అహ్మద్ (72) ఒక్కడే పోరాడినా మిగతా వారి నుంచి తగిన సహకారం లేకపోవడంతో పాక్ ఓటమి పాలైంది.
ఆస్ట్రేలియా బౌలర్లలో హజల్ ఉడ్, స్టీవ్ ఓ కీఫ్‌లు చెరో మూడు వికెట్లు తీసుకోగా లయన్ రెండు, స్టార్క్ ఒక వికెట్ తీసుకున్నారు. మూడో టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి. మంగళవారం ప్రారంభమైన ఈ టెస్టు తొలి సెషన్‌లోనే సెంచరీ సాధించి 40 ఏళ్లుకు పైగా ఉన్న రికార్డుని బద్దలు కొట్టిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ రెండో ఇన్నింగ్స్‌లో మరో రికార్డు నెలకొల్పాడు.
నాలుగో రోజు ఆటలో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ టెస్టుల్లో రెండో వేగవంతమైన అర్ధసెంచరీని సాధించాడు. కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా టెస్టుల్లో రెండో ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు.
తొలి ఇన్నింగ్స్:
ఆస్ట్రేలియా 538/8 డిక్లేర్,
పాకిస్థాన్: 315 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్
ఆస్ట్రేలియా: 241/2 డిక్లేర్
పాకిస్తాన్: 244 ఆలౌట్
మ్యాచ్ ఫలితం: 220 పరుగుల తేడాతో పాక్‌పై ఆసీస్ విజయం