
సిడ్నీ: కరోనా వైరస్ తెచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీసేన తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మరికొద్ది సేపట్లో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టులో మార్పులు చేశాడు. రోహిత్ శర్మ స్థానంలో మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా రానున్నాడు. మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలు ఆడుతున్నారు. మనీష్ పాండే, శుబ్మాన్ గిల్, శార్దుల్ ఠాకూర్, నటరాజన్ మరియు సంజు సాంసన్‌లకు తుది జట్టులో చోటు దక్కలేదు.
ఆస్ట్రేలియాపైకోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. వన్డేల్లో ఐదు సెంచరీలు సహా 50 సగటుతో 1154 పరుగులు చేశాడు. అయితే సిడ్నీ మాత్రం అతనికి కలిసి రాలేదు. ఈ గ్రౌండ్‌లో విరాట్ ఐదు ఇన్నింగ్స్‌లో కేవలం 9 సగటుతో పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 21 మాత్రమే. మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ గ్రౌండ్‌లో ఇండియాపై మంచి రికార్డు ఉంది. మొత్తం 14 గెలిచి కేవలం రెండింట్లో మాత్రమే ఓడిపోయింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన చివరి నాలుగు వన్డేల్లో మూడు ఇండియానే గెలవడం కాస్త ఊరట కలిగించేది.
ఈ సిరీస్‌కు అభిమానులను స్టేడియాల్లోకి అనుమతిస్తున్నారు. సిడ్నీలో జరిగే తొలి వన్డేకు 50 శాతం మాత్రమే నిండేలా ప్రేక్షకులను అనుమతించారు. 9 నెలల తర్వాత టీమిండియా ఆడనున్న తొలి అంతర్జాతీయ సిరీస్ కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత పర్యటనలో టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలిచి చరిత్ర సృష్టించిన కోహ్లీసేన.. ఈసారి కూడా అలాంటి అద్భుతం చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ మధ్య న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా సిరీస్‌ను బట్టి చూస్తే ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదవడం ఖాయం. ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 312గా ఉంది. చివరి 7 మ్యాచ్‌లలో 6 మొదటి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది.
జట్లు:
భారత్: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చహల్, నవదీప్ సైనీ, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్నస్ లబుషేన్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, ఆడం జంపా.