AUS vs AFG: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘన్ జట్టు సంచలనం సృష్టించింది. ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను ఓడించిన తర్వాత ఆఫ్ఘన్లు తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. ఇప్పుడు లీగ్ దశలో సెమీ ఫైనల్ బెర్తు కోసం ఆఫ్ఘనిస్తాన్ నేడు ఆస్ట్రేలియాతో పోటీపడనుంది. ఇంగ్లాండ్ ను ఇంటి ముఖం పట్టించిన ఆఫ్ఘన్ జట్టు.. మరో సంచలన విజయంతో ముందుకు వెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. సెమీ ఫైనల్స్ చేరుకోవడానికి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోటీ ఉంటుంది. ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్. ఆఫ్ఘన్ జట్టు గెలిస్తే సెమీ ఫైనల్స్ కు వెళ్తుంది. ఆస్ట్రేలియా గెలిస్తే ఆ జట్టు సెమీ ఫైనల్ కు చేరుకుంటుంది.
ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రికార్డు సెంచరీ చేసిన ఇబ్రహీం జద్రాన్, ఐదు వికెట్లు తీసిన అజ్మతుల్లా ఒమర్జాయ్ మరోసారి ఆ జట్టుకు కీలక కానున్నారు. మరో వైపు రెండు సార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ లో అడుగుపెట్టి తీరాలని భావిస్తోంది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ ను ఓడించిన ఆసీస్.. అంతకు ముందు దక్షిణాఫ్రికాతో రెండో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో పోరు.. ఆసీస్ జట్టుకు క్వార్టర్ ఫైనల్ గా మారింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టును తేలికగా తీసుకుంటే మాత్రం ఆసీస్ మూల్యం చెల్లించక తప్పకపోవచ్చు.

ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇలా..
వన్డే క్రికెట్ లో ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ లు జరిగాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తం 4 వన్డేల్లో తలపడగా.. ఈ నాలుగు మ్యాచ్ ల్లోనూ ఆస్ట్రేలియానే గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ తొలి విజయం కోసం చూస్తోంది. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. రెండు జట్లలో ఏదైనా గెలిచే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ ను ఓడించిన తర్వాత ఏది గెలుస్తుందో చెప్పడం అంత సులువేం కాదు. ఆస్ట్రేలియా గతంలో పైచేయి సాధించినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ ను తక్కువగా అంచనా వేయలేం.
ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ పిచ్ రిపోర్టు
ఈ మ్యాచ్ లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లోని పిచ్ బ్యాటర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంటుంది. లాహోర్ లో సాధారణంగా బ్యాటింగ్ ట్రాక్ లు ఉంటాయి. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించగలరు. టాస్ గెలిచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేస్తే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వెదర్ రిపోర్టు
వాతావరణం విషయానికొస్తే.. పగటి పూట వర్షం పడే అవకాశం ఉంది కానీ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి అంతా బాగానే ఉంటుంది. రావల్పిండి లాగా ఇక్కడ ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం లేదు. రెండు జట్ల మధ్య పూర్తి స్థాయి పోటీ ఉంటుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.