
మెల్‌బోర్న్: యాషెస్ సిరీస్‌లో అతిథ్య ఆస్ట్రేలియా అధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటికే సిరీస్‌లోని తొలి రెండు టెస్టు మ్యాచ్‌లను గెలుచుకుని అధిక్యంలో ఉన్న ఆ జట్టు నేటి నుంచి మెల్‌బోర్న్ వేదికగా మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్‌లోనూ తొలి రోజు అధిక్యాన్ని కనబరించింది. తొలి రోజు అంతా ఆస్ట్రేలియా పూర్తి అధిక్యాన్ని కనబరచడంతో ఇంగ్లండ్‌కు నిరాశ తప్పలేదు. తొలి రోజు ఆట ముగేసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసిది. క్రీజులో 20 పరుగులతో మార్కస్ హారిస్, నాథన్ లియోన్ ఉన్నారు. 38 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ను అండర్సన్ ఔట్ చేశాడు. దీంతో తొలి రోజు ఆట మగిసే సమయానికి ఆస్ట్రేలియా 124 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. ఆ జట్టు చేతిలో ఇంకా 9 వికెట్లు ఉన్నాయి.
కాగా అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ తీరు మారలేదు. తొలి రెండు టెస్టుల్లో మాదిరిగానే ఈ మ్యాచ్‌లోనూ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆసీస్ బౌలర్ల ధాటికి 60.1 ఓవర్లలో 185 పరుగులకే కుప్పకూలారు. కెప్టెన్ జో రూట్ మినహా ఎవరూ రాణించలేకపోయారు. రూట్ 50, బెయిర్‌స్టో 35, స్టోక్స్ 25, రాబిన్సన్ 22, మలాన్ 14, జాక్ లీచ్ 13, జాక్ క్రాలే 12, మార్క్ వుడ్ 6, బట్లర్ 3 పరుగులు చేశాడు. ఓపెనర్ హమీద్ డకౌట్ అయ్యాడు. కంగారు బౌలర్లలో కమిన్స్, నాథన్ లియోన్ మూడేసి వికెట్లు తీయగా.. స్టార్క్ 2, బోలాండ్, గ్రీన్ తలో వికెట్ తీశారు. తొలి రోజు ఆటలో మొత్తం 81.1 ఓవర్ల ఆట సాగింది. 246 పరుగులు రాగా.. 11 వికెట్లు నేల కూలాయి.
యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే పూర్తైన తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. దీంతో సిరీస్‌లో నిలబడాలంటే ఆ జట్టు ఈ మ్యాచ్ గెలవడం లేదా కనీసం డ్రా చేసుకోవడం చేయాలి. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఇంగ్లండ్‌ను బ్యాటింగ్ సమస్య ప్రధానంగా వేధిస్తోంది. ఆ జట్టులోని బ్యాటర్లు రాణించలేకపోతున్నారు. కెప్టెన్ రూట్ మినహా బ్యాటర్లెవరూ మంచి స్కోర్లు చేయలేకపోతున్నారు. దీంతో ఇంగ్లీష్ ప్లేయర్ల తీరుపై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.