
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-2023 పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా నంబర్ వన్ ప్లేసుకు దూసూకెళ్లింది. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో దుమ్ము రేపుతున్న ఆ జట్టు టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ అదే దూకుడు చూపించింది. ఇంగ్లండ్‌తో నేడు ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన ఆసీస్ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ మూడింటిలోనూ గెలిచి 100 శాతం విజయాలతో మొదటి స్థానం కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియా ఖాతాలో 36 పాయింట్లు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక రెండింటిలోనూ గెలిచి 100 శాతం విజయాలతో రెండో స్థానంలో ఉంది. లంక ఖాతాలో 24 పాయింట్లు ఉన్నాయి. శ్రీలంక తర్వాత మూడో స్థానంలో పాకిస్థాన్ ఉంది. ఇప్పటివరకు రెండు సిరీస్‌ల్లో 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన పాక్ జట్టు మూడింట్లో గెలిచి, ఓ దాంట్లో ఓడింది. దీంతో 75 శాతం విజయాలతో మూడో స్థానంలో ఉంది. పాక్ ఖాతాలో 36 పాయింట్లు ఉన్నాయి.
ఇక ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటివరకు 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 3 గెలిచింది. 2 డ్రా చేసుకోని, ఒకటి ఓడిపోయింది. మొత్తంగా 58 శాతం విజయాలతో భారత్ ఖాతాలో 42 పాయింట్లు ఉన్నాయి. భారత్ తర్వాతి స్థానంలో 25 శాతం విజయాలతో వెస్టిండీస్ ఐదో స్థానంలో ఉంది. ఇప్పటివరకు 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఒక్కటి గెలిచి, మూడు ఓడిపోయింది. విండీస్ ఖాతాలో ప్రస్తుతం 12 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటివరకు 2 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ ఆరో స్థానంలో ఉంది.
ఆడిన రెండు టెస్టుల్లో ఆ జట్టు ఒకటి డ్రా చేసుకోగా, మరోకటి ఓడిపోయింది. ఇక 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ ఒకటి మాత్రమే గెలిచి ఏడో స్థానంలో ఉంది. ఐదింటిలో ఓడిపోగా, ఒకటి డ్రా చేసుకుంది. 7 శాతం విజయాలతో ఇంగ్లండ్ ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటివరకు 2 టెస్టు మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ రెండింటిలోనూ ఓడి.. పాయింట్ల ఖాతా తెరవలేదు. దీంతో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-2023లో ఆ జట్టు చిట్ట చివరన ఎనిమిదో స్థానంలో ఉంది.