హైదరాబాద్: భారత స్పిన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. భారత్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య చెన్నై వేదికగా సెప్టెంబర్ 17న తొలి వన్డే జరగనుంది.
ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలో నెట్ ప్రాక్టీస్ అనంతరం స్మిత్ మీడియాతో మాట్లాడాడు. గత కొంతకాలంగా తిరుగులేని విజయాలు సాధిస్తున్న టీమిండియాపై పైచేయి సాధించడం అంత ఈజీ కాదని తమ ఆటగాళ్లను ముందుగా హెచ్చరించారు. భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ను క్రీడాస్ఫూర్తితో ఆడతామని చెప్పాడు.

'ఇదొక క్లిష్టమైన పర్యటన. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన భారత జట్టు విజయవంతంగా సిరిస్‌ను ముగించింది. భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టును ప్రతిఘటించడం కష్టమే. ఆస్ట్రేలియా జట్టుకు ఇదొక సవాల్‌గా భావిస్తున్నా. అదే సమయంలో కోహ్లీ సేనను ఢీకొనేందుకు ఆతృతగా ఉన్నాం' అని స్మిత్ పేర్కొన్నాడు.
'బంగ్లా పర్యటనలో మా జట్టు ఆటగాళ్లు ఎంతో నేర్చుకున్నారు. ఇది మాకు కలిసొచ్చే అంశం. టెస్టు క్రికెట్‌లో స్పిన్‌ను ఎలా ఆడాలో నేర్చుకుంటున్నాం. టెస్టుల్లో స్పిన్‌కు, వన్డేల్లో స్పిన్‌కు తేడా ఉంటుంది. అక్షర్ పటేల్ బాగా ఆడుతున్నాడు. చాహల్, కుల్దీప్ కూడా జట్టులో ఉన్నారు. కోహ్లీ జట్టులో మంచి స్పిన్నర్లు ఉన్నారు' అని స్మిత్ అన్నాడు.
'సొంత గడ్డపై భారత్‌ను ఓడించడం పెద్ద సవాల్. 2013లో భారత్ పర్యటించినప్పుడు ఆసీస్ జట్టులో లేను. ఆ సిరీస్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మా వన్డే జట్టు స్పిన్‌ను బాగానే ఎదుర్కోగలదు. ఐపీఎల్ ఆడిన లెగ్ స్పిన్నర్ అడమ్ జంపా ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడ్డాడు' అని పేర్కొన్నాడు.
ఈ సిరీస్‌లో అతను రాణించి జట్టుకు విజయాలను అందిస్తాడని ఆశిస్తున్నానని స్మిత్ తెలిపాడు. పిచ్ పరిస్థితులను బట్టి వ్యూహాలు రూపొందిస్తామని తెలిపాడు. మరొకవైపు ఎటువంటి వివాదాలు లేకుండా ఒక మంచి వాతావరణంలోనే మొత్తం సిరీస్ జరుగుతుందని ఆశిస్తున్నానని స్మిత్ తెలిపాడు. సెప్టెంబర్ 17వ తేదీన చెన్నై వేదికగా తొలి వన్డేతో ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.