హైదరాబాద్: ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజులు టెస్టు మ్యాచ్‌లను ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు తిరస్కరించారు. అక్టోబర్ నెలలో ఆక్లాండ్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ప్రేక్షకుల నుంచి టెస్టులకి ఆదరణ తగ్గుతుండటంతో ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకి కుదించాలని ప్రతిపాదించారు.
ఇందు కోసం టెస్టు హోదా కలిగి ఉన్న సభ్య దేశాల అభిప్రాయాలను కూడా ఐసీసీ సేకరించింది. అయితే ప్రయోగాత్మకంగా డిసెంబరులో దక్షిణాఫ్రికా, జింబాబ్వే మధ్య జరగనున్న నాలుగు రోజుల టెస్టుని నిర్వహించేందుకు కూడా ఐసీసీ అంగీకారం తెలిపింది.

దీంతో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ 'వ్యక్తిగతంగా చెప్పాలంటే.. నాకు ఐదు రోజుల టెస్టు మ్యాచ్ అంటేనే ఇష్టం. భవిష్యత్‌లో కూడా ఈ తరహా టెస్టులే ఆడాలని కోరుకుంటున్నా' అని చెప్పుకొచ్చాడు.
ఇక, ఆసీస్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ 'టెస్టు క్రికెట్ బాగా సంప్రదాయబద్ధంగా జరుగుతోంది. ఒక మ్యాచ్ ఐదో రోజుకి చేరిందంటే అదో గొప్ప విషయం. ముఖ్యంగా.. ఆ రోజు చివరి గంట ఎంత కీలకమో? నాకు తెలిసి ఆ చివరి నిమిషాలే ఆటలో ఎక్కువ మజా ఇస్తాయి' అని అన్నాడు.
ఇదిలా ఉంటే నవంబరు 23 నుంచి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ ఆరంభం కానుంది.