అనుకున్నదే జరిగింది. అప్ఘానిస్థాన్ సెమీఫైనల్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్ వర్షార్పణం అయింది. దీంతో మ్యాచ్ రద్దు అయింది.

వాస్తవానికి వర్షం పడి ఆగినప్పటికీ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో మ్యాచ్ ను రద్దు చేస్తూ అంపైర్లు ప్రకటన చేశారు. ఫలితంగా అఫ్ఘాన్ కు , ఆసీస్ కు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో నాలుగు పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మూడు పాయింట్లతో అప్ఘానిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అద్భుతం జరిగితే..
మార్చి 1న సౌతాఫ్రికా - ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఏదైనా అద్భుతం జరిగి సౌతాఫ్రికాపై ఇంగ్లాండ్ భారీ విజయం సాధిస్తే.. ఆఫ్ఘానిస్థాన్ కు సెమీస్ చేరొచ్చు. ఎలాగంటే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై దక్షిణాఫ్రికా ఓడినా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. కానీ అది మరీ దారుణంగా ఓటమి చెందకూడదు. ఒకవేళ దారుణంగా ఓడితే మాత్రం దక్షిణాఫ్రికా రన్‌రేట్ మైనస్‌లోకి వెళ్తే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఆఫ్ఘానిస్థాన్ సెమీస్ లోకి రావొచ్చు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో 4 పాయింట్లు (0.475) ఉన్నాయి. దక్షిణాఫ్రికా ఖాతాలో 3 పాయింట్లు (2.140), ఆఫ్ఘానిస్థాన్ ఖాతాలో 3 పాయింట్లు (-0.990) ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ కాసేపు సాగిందిలా..
ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన అఫ్ఘానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సెదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 85 పరుగులు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్ ల సాయంతో 67) మంచి ప్రదర్శన చేశారు. అనంతరం 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 12.5 ఓవర్లకు ఓ వికెట్ కోల్పోయి 109 పరుగులు చేసింది. అప్పటికీ ట్రావిస్ హెడ్ (59), స్టీవ్ స్మిత్ (19) పరుగులతో క్రీజులో నాటౌట్‌గా ఉన్నారు. ఆ సమయంలోనే వర్షం పడి పెద్దగా అయింది.