అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా భారత్ మరో సమరానికి సిద్ధమైంది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన విషయం తెలిసిందే. 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సిరీస్‌లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను భారత్ తప్పనిసరిగా గెలవాలి. ఈ క్రమంలో గబ్బా టెస్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే క్రిస్మస్‌కు ముంగిట గబ్బాలో ఆడిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు మెరుగైన రికార్డు ఉంది.

క్రిస్మస్ ముందు గబ్బాలో ఆడిన 61 టెస్టుల్లో ఆస్ట్రేలియా ఏడు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయింది. అదే క్రిస్మస్ తర్వాత ఆడిన అయిదు టెస్టుల్లో మూడింట్లో పరాజయం పాలైంది. ఇందులో గత మూడేళ్లలోనే రెండు ఓటమలు చవిచూసింది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా టెస్టులో భారత్ విజయం సాధించింది. 1988 నుంచి గబ్బాలో ఓటమెరుగని కంగారూలను మట్టికరిపించింది. కాగా, గబ్బా వికెట్‌ను బౌన్సీ పిచ్‌గా సిద్ధం చేసినట్లు క్యురేటర్ డేవిడ్ సందుర్స్కీ చెప్పాడు. సంప్రదాయమైన వికెట్‌నే సిద్ధం చేశామని తెలిపాడు.
ప్రతి ఏడాది తరహాలోనే మంచి పేస్, వేగం ఉండేలానే గబ్బా వికెట్ ఉందని డేవిడ్ అన్నాడు. బంతి-బ్యాటుకు మధ్య పోటీ సమతూకంగా ఉండేలా రూపొందించామని చెప్పాడు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజు వర్షం కురిసే అవకాశం ఉందని, ఈ క్రమంలో టాప్ ఆర్డర్ బ్యాటర్లకు పిచ్ అత్యంత సవాలుతో ఉంటుందని అన్నాడు. కాగా, గత కొన్ని రోజులు జల్లులు పడటంతో గబ్బా మైదానాన్ని మంగళవారం వరకు కవర్లతో కప్పి ఉంచారు.