హైదరాబాద్: టీమిండియాతో మూడు టీ20ల సిరిస్‌కు సిద్ధమవుతున్న ఆస్ట్రేలియా జట్టుకు నిజంగా ఇది చేదువార్తే. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు వన్డేలకి రిటైర్మెంట్ ప్రకటిస్తూ శుక్రవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.
గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న 31 ఏళ్ల హేస్టింగ్స్ వన్డేలు, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. ఇకపై తాను టీ20ల్లో మాత్రమే ఆడనున్నట్లు ప్రకటించాడు. ఆస్ట్రేలియా తరుపున హేస్టింగ్స్ కేవలం ఒకే ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు.
'భుజానికి నాలుగు సార్లు గాయాలయ్యాయి. మోకాలికి కూడా నాలుగు సార్లు ఆపరేషన్ చేశారు. ఇన్ని గాయాలైనా.. పట్టుదలతో మళ్లీ తిరిగి మైదానంలోకి రాగలిగాను. కానీ.. వన్డే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌ల్లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేసే సామర్థం ప్రస్తుతం నా శరీరానికి లేదు. అందుకే ఆ ఫార్మాట్లకి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా' అని తెలిపాడు.
'ఇది చాలా కఠినమైన నిర్ణయమని నాకు తెలుసు. కానీ, ఆ ఫార్మాట్లకి దూరంగా ఉంటే తప్ప టీ20ల్లో మెరుగ్గా రాణించలేనని నాకు అర్థమైంది' అని పేర్కొన్నాడు. గతేడాది 15 వన్డేలాడిన హేస్టింగ్స్ 29 వికెట్లు తీసి 2016లో ఎక్కువ వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.

క్రికెట్ ఆస్ట్రేలియా ఛీప్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సందర్లాండ్ మాట్లాడుతూ హేస్టింగ్స్ అద్భుతమైన అటగాడని కొనియాడాడు. ఇదిలా ఉంటే భారత్-ఆస్ట్రేలియాల మధ్య శనివారం రాంచీ వేదికగా తొలి టీ20 జరగనుంది. దీనికి ముందు జరిగిన ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.