
ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను రిటైర్ అవడాని కంటే ముందు ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలవాలని కోరికగా ఉందని వార్నర్ వెల్లడించాడు. ఇప్పటివరకు తాను భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవలేదని అయితే ఈ సారి గెలవడానికి ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు. భారత్‌ను భారత్‌లోనే ఓడించి టెస్టు సిరీస్ గెలవాలని ఉందన్నాడు. గతంలో స్టీవెన్ స్మిత్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గతేడాది ఇంగ్లండ్‌లో యూషెస్ సిరీస్‌ను డ్రా చేసుకున్నామని, అయితే 2023లో ఇంగ్లండ్‌లో జరిగే యాషెస్ సిరీస్‌ను గెలుస్తామని వార్నర్ ధీమా వ్యక్తం చేశాడు.
తాజాగా సొంత గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇప్పటికే 3-0 తేడాతో కైవసం చేసుకున్న నేపథ్యంలో వార్నర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తన ఫామ్ గురించి కూడా ప్రస్తావించిన వార్నర్ తాను ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నానని, భవిష్యత్‌లోనూ ఇదే ఫామ్ కొనసాగించడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తన కెరీర్‌కు వయసు అడ్డంకిగా భావించడం లేదని తెలిపాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌పై వార్నర్ ప్రశంసలు కురించాడు.
అండర్సన్ ఈ వయస్సులోనూ అద్భుతంగా రాణిస్తూ ఎక్కువ వయసు వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడని కొనియాడాడు. అతనొక బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేశాడని అన్నాడు. అలాగే కొత్త సంవత్సరంలో వీలైనన్నీ ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తానని వార్నర్ చెప్పాడు.
కాగా ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో వార్నర్ రాణిస్తున్నాడు. తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 94 పరుగులు చేశాడు. సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 95 పరుగులతో రాణించాడు. అంతకు ముందు జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలోనూ వార్నర్ కీలక పాత్ర పోషించాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు 89 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 48 సగటుతో 7,551 పరుగులు చేశాడు. ఇందులో 24 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
రెండు సార్లు డబుల్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకున్నాడు. ఓ ట్రిపుల్ సెంచరీ చేశాడు. అత్యధిక స్కోర్ 335 పరుగులు. ఇక 128 వన్డే మ్యాచ్‌లు ఆడి 45 సగటుతో 5,455 పరుగులు చేశాడు. 18 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 179 పరుగులు. అలాగే 88 టీ20 మ్యాచ్‌ల్లో 32 సగటుతో 2554 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 100 పరుగులు.