భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులు ఉన్న టీమ్ ఇది. ఇందులో గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్ కు చోటు దక్కలేదు. గాయాల కారణంగా వారిని జట్టులోకి తీసుకోలేదు. వారి స్థానాలను మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్‌షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్ భర్తీ చేశారు. వన్డే స్పెషలిస్టులు జట్టులో ఉన్నారు. ఆల్ రౌండర్లకు అధిక ప్రాధాన్యత లభించింది.
భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. మొత్తం మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్ లల్లో ఆసీస్ తో తలపడుతుంది. తొలి వన్డే మ్యాచ్ ఈ నెల 19వ తేదీన. పెర్త్ దీనికి వేదిక. 23, 25 తేదీల్లో అడిలైడ్, సిడ్నీల్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. 29 నుంచి టీ20 సిరీస్ ఆరంభమౌతుంది. తొలి మ్యాచ్ కు క్యాన్ బెర్రా వేదిక. 31, నవంబర్ 2, 6, 8 తేదీల్లో మెల్ బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లల్లో మిగిలిన మ్యాచ్ లు ఉంటాయి.

టీమిండియాతో తలపడే ఆస్ట్రేలియా జట్టుకు మిఛెల్ మార్ష్ కేప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గాయాల కారణంగా గ్లెన్ మాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్ చోటు దక్కించుకోలేకపోయారు. వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు కమ్మిన్స్. ఇప్పడిప్పుడే కోలుకుంటోన్నాడు. అతనికి మరింత విశ్రాంతి ఇవ్వాల్సి ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. అతన్ని జట్టులోకి తీసుకోలేదు. కమ్మిన్స్ స్థానంలో మిచెల్ మార్ష్ కు కేప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.
గ్లెన్ మాక్స్‌వెల్ కూడా గాయం నుంచి కోలుకోలేదు. రిస్ట్ ఫ్రాక్చర్ కు అతను ట్రీట్మెంట్ తీసుకుంటోన్నాడు. దీంతో భారత్ తో జరగబోయే వన్డే, టీ20 జట్ల నుండి అతన్ని తప్పించారు. బిగ్ బాష్ లీగ్ నాటికి మ్యాక్స్ వెల్ కోలుకునే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ పై వేటు పడింది. పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు.
ఆస్ట్రేలియా వన్డే జట్టు- మిఛెల్ మార్ష్ (కేప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్‌షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా ఉన్నారు. కామెరాన్ గ్రీన్ గాయం తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. అయితే, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు టీ20 జట్టులో చోటు దక్కలేదు.
కొత్తగా జట్టులోకి వచ్చినవారు: మిఛెల్ ఓవెన్, మాథ్యూ రెన్‌షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్.
చోటు దక్కనివారు: ఆరోన్ హార్డీ, మాథ్యూ కుహ్నేమాన్, మార్నస్ లబుషేన్.