హైదరాబాద్: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. చాపెల్-హ్యాడ్లీ ట్రోఫీలో భాగంగా ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 286 పరుగులు చేసింది.
అనంతరం 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 67 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మార్కస్ స్టోయినిస్ ఒంటి చేత్తో మ్యాచ్‌ని ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 117 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 146 పరుగులు చేశాడు.
తన కెరీర్‌లో రెండో వన్డే ఆడుతున్న మార్కస్ స్టోయినిస్ ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒకానొక సమయంలో ఆస్ట్రేలియా మ్యాచ్ గెలిచేలా అనిపించినప్పటికీ, అవతలి ఎండ్‌లో సరైన సహకారం లేకపోవడంతో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే ఆలౌటైంది.

47వ ఓవర్లో చివరి బంతికి హాజెల్ ఉడ్ రనౌట్ కావడంతో ఆస్ట్రేలియా రనౌట్ కావడంతో ఆసీస్ ఓటమి పాలైంది. ఇక్కడ విశేషం ఏమిటంటే హాజెల్ ఉడ్ ఒక్క బంతి కూడా ఎదుర్కొకుండా రనౌట్ కావడం. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో గప్టిల్ (61), బ్రూమ్(73), నీషమ్(48), విలియమ్సన్(24)లు ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్ విజయంతో మూడు వన్డేల సిరిస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలో ఉంది. కివీస్‌తో జరుగుతున్న ఈ సిరిస్‌కు ఆసీస్ టాప్ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.