మెల్బోర్న్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి శనివారం ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్లు కోల్పోయి 345 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాజా సెంచరీ చేశాడు. అతను 144 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో అతను హ్యాట్రిక్ సెంచరీలను నమోదు చేశాడు. అంతకు ముందు న్యూజిలాండ్‌పై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఖాజా రెండు టెస్టులు ఆడి రెండు సెంచరీలు చేశాడు.
ఆస్ట్రేలియాపై అంతకు ముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ ఆతిథ్య జట్టును బ్యాటింగ్‌కి పిలిచింది. ఉస్మాన్ ఖ్వాజా (144 పరుగులు), బర్న్స్ (128 పరుగులు)లు సెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరు 2వ వికెట్‌కు 258 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని జోడించారు. కాగా టేలర్ బౌలింగ్‌లోనే వీరిద్దరూ ఔటయ్యారు.

ప్రస్తుతం స్మిత్ (32 పరుగులు), ఆడమ్ ఓజెస్ (10 పరుగులు)లు క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో టేలర్ 2 వికెట్లు, బ్రత్ వెయిట్ 1 వికెట్ తీశారు. 3 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 212 పరుగుల తేడాతో విజయం సాధించింది.
న్యూజిలాండ్‌తో సిరీస్ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన ఖ్వాజా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగతున్న రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. 2011లో సిడ్నీలో ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అతను ఆరంగేట్రం చేశాడు. అయితే, అప్పట్లో అతను పెద్దగా రాణించలేదు. పైగా పదే పదే గాయాలు అతన్ని వేధిస్తూ వచ్చాయి. దాంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఇటీవల తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.