
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిపై ఆస్ట్రేలియా గ్రేట్ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ ప్రశంసలు కురిపించాడు. ధోని కెప్టెన్సీని కొనియాడాడు. ధోని నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మిగతా కెప్టెన్ల కంటే భిన్నంగా ఉంటుందని చెప్పాడు. అంతేకాకుండా ధోనిని ఫాస్టెస్ట్ మైండెడ్ ప్లేయర్‌లలో ఒకరిగా ఆయన పరిగణించాడు. ధోని వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో నేర్పరి అని తెలిపాడు. మహేంద్రసింగ్ ధోనితో కలిసి పని చేశానని చెప్పిన ఆయన తన ప్రతిభను మెరుగు పరచుకోవడానికి అతను తనదైన రీతిలో ఆడతాడని, అలాగే నిర్ణయాలు తీసుకుంటాడని తెలిపాడు. ధోని తన కెరీర్ ప్రారంభ రోజుల్లో విభిన్న పిచ్‌లపై సీనియర్ల ముందు ఆడడం ద్వారా నిర్ణయాలు తీసుకోవడం, వ్యూహాలు రచించడంలో ప్రావీణ్యం సంపాదించాడని ఆయన అన్నాడు. ఈ కారణంగానే ధోని ఇతరుల కంటే భిన్నంగా ఉంటాడని గ్రెగ్ చాపెల్ చెప్పాడు. కాగా రాహుల్ ద్రావిడ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు గ్రెగ్ చాపెల్ టీమిండియాకు హెడ్ కోచ్‌గా పని చేశాడు.
సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్‌గా, జాన్ రైట్ హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడగుపెట్టాడు. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ కెప్టెన్‌గా, గ్రెగ్ చాపెల్ హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు భారత జట్టులో బ్యాటర్‌గా సత్తా చాటాడు. అనంతర రోజుల్లో టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్‌గా టీమిండియాను సుదీర్ఘ కాలం పాటు అన్ని ఫార్మాట్లలో విజయంతంగా నడిపించాడు. ఈ క్రమంలో ఇటు బ్యాటర్‌గా, అటు కెప్టెన్‌గా ధోని అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎవరికీ సాధ్యం కానీ ఘనతలను సొంతం చేసుకున్నాడు. ధోని నాయకత్వంలో భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచింది. 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచింది. అలాగే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో సుదీర్ఘ కాలంపాటు కొనసాగింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఐసీసీ మేజర్ టోర్నీలు గెలిచిన ఒకే ఒక్క కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోని నిలిచాడు.
ఇక 15 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో ధోని అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా వేల కొద్దీ పరుగులు సాధించాడు. 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 38 సగటుతో 4876 పరుగులు చేశాడు. ఇందులో 33 హాఫ్ సెంచరీలు, 6 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 224 పరుగులు. ఇక 350 వన్డే మ్యాచ్‌ల్లో 50 సగటుతో 10773 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 183 పరుగులు. అలాగే 98 టీ20 మ్యాచ్‌ల్లో 37 సగటుతో 1617 పరుగులు చేశాడు. 2 సార్లు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోగా.. అత్యధిక స్కోర్ 56 పరుగులు.