
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో అతిథ్య ఆస్ట్రేలియా జట్టు సంపూర్ణ అధిపత్యం కనబరుస్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా ఆస్ట్రేలియా అధిపత్యం కొనసాగింది. వికెట్ నష్టానికి 45 పరుగులతో నేడు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా చివరకు తమ స్కోర్‌ను 9 వికెట్ల నష్టానికి 230 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. లబుశ్చేంజ్, హెడ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లోని 237 పరుగుల అధిక్యాన్ని కలుపుకుని ఆ జట్టు ఇంగ్లండ్‌పై 467 పరుగుల భారీ అధిక్యంలో నిలిచింది.
లక్ష్య చేధనలో ఇంగ్లండ్ తడబాటు
ఇక పింక్ బాల్ టెస్ట్‌లో 468 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ హమీద్ పరుగులేమి చేయకుండానే రిచర్డ్సన్ బౌలింగ్‌లో అలెక్స్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 4 పరుగులకే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో డేవిడ్ మలాన్‌తో కలిసి మరో ఓపెనర్ రోరి బర్న్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 48 పరుగుల వద్ద ఉండగా 20 పరుగులు చేసిన మలాన్.. నెసర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అలాగే జట్టు స్కోర్ 70 పరుగుల వద్ద ఉండగా ఇంగ్లండ్‌ను రిచర్డ్సన్ మరోసారి దెబ్బకొట్టాడు. 34 పరుగులు చేసిన ఓపెనర్ రోరి బర్న్స్‌ను ఔట్ చేశాడు. ఆ కాసేపటికే కెప్టెన్ జో రూట్ 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. 3 పరుగులతో స్టోక్స్ క్రీజులో ఉన్నాడు. విజయానికి ఇంగ్లండ్ ఇంకా 386 పరుగుల దూరంలో ఉంది. అయితే చివరిదైన ఐదో రోజు ఇంగ్లండ్ బ్యాటర్లు ఆసీస్ పేస్ ధాటికి ఎంతసేపు నిలబడగలరనేది చూడాలి. ప్రస్తుతం ఆస్ట్రేలియా దూకుడు చూస్తుంటే సోమవారం మ్యాచ్ గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఇప్పటికే బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ను గెలచుకుని 5 టెస్టుల యాషెస్ సిరీస్‌లో అతిథ్య ఆస్ట్రేలియా 1-0తో అధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
పింక్ బాల్ టెస్ట్‌లో స్టార్క్ రికార్డు
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ సరికొత్త రికార్డు సృష్టించాడు. డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. నాలుగో రోజు ఆటలో స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు. కాగా స్టార్క్ ఇప్పటివరకు తన టెస్ట్ కెరీర్‌లో 262 వికెట్లు సాధించాడు.