
యాషెస్ సిరీస్‌లో కరోనా కలవరం కొనసాగుతుంది. ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు స్టాఫింగ్ స్టాఫ్‌లోని ఏడుగురు సభ్యులు కరోనా బారిన పడగా.. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావియస్ హెడ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. అయితే 28 ఏళ్ల హెడ్‌కు ఎటువంటి కరోనా లక్షణాలు లేవు. ప్రతి రోజూ టీమ్ మొత్తానికి నిర్వహించే కరోనా టెస్టుల్లో భాగంగా హెడ్‌ను కూడా పరీక్షించగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో హెడ్ వారం రోజులపాటు భార్యతో కలిసి మెల్‌బోర్న్‌లోనే ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. దీంతో జనవరి 5 నుంచి సిడ్నీ వేదికగా జరిగే నాలుగో టెస్టు మ్యాచ్‌కు హెడ్ దూరం కానున్నాడు. దీంతో హెడ్ స్థానంలో మిచెల్ మార్ష్, నిక్ మాడిన్సన్, జోష్ ఇంగ్లిస్‌లను ఆస్ట్రేలియా జట్టులో చేర్చుకున్నారు. అయితే హోబర్ట్ వేదికగా జరిగే సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్‌కు హెడ్ అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. కాగా కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన కారణంగా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో టెస్ట్ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
కెరీర్‌లో ఇప్పటివరకు 22 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన హెడ్ 42 సగటుతో 1401 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 42 వన్డే మ్యాచ్‌ల్లో 34 సగటుతో 1273 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 128 పరుగులు. ఇక 16 టీ20 మ్యాచ్‌ల్లో 26 సగటుతో 319 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 48 పరుగులు. ఐపీఎల్‌లో కూడా 10 మ్యాచ్‌లు ఆడిన హెడ్ 29 సగటుతో 205 పరుగులు చేశాడు. ఒక హాఫ్ సెంచరీ సాధించగా.. అత్యధిక స్కోర్ 75.