న్యూఢిల్లీ : సరిగ్గా ఆరు సంవత్సరాల ఏడు నెలల తర్వాత.. టెస్టుల్లో టీమ్ ఇండియా మరోసారి అగ్ర స్థానాన్ని చేజిక్కుంచుకుంది. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకుల్లో టీమ్ ఇండియాకు మొదటి ర్యాంకు దక్కగా.. తర్వాతి స్థానాల్లో పాక్, ఆసీస్ కొనసాగుతున్నాయి. శ్రీలంకతో వైట్ వాష్ కు గురైన ఆసీస్ మొదటి ర్యాంకు నుంచి మూడో స్థానానికి పడిపోగా.. గత వారం ఇంగ్లాడ్ పై 22 తో టెస్టు సిరీస్ ను సమం చేసిన పాక్ రెండో స్థానాన్ని దక్కించుకుంది.
అయితే ఐసీసీ ప్రకటించిన నంబర్ వన్ ర్యాంకును భారత్ నిలుపుకోవాలంటే.. కరేబీయన్లతో జరిగే చివరి టెస్టులోనే భారత్ సత్తా చాటాల్సి ఉంటుంది. ఒకవేళ కరేబియన్ల చేతిలో భారత్ చతికిలపడితే రెండో స్థానంలో ఉన్న పాక్ అగ్ర స్థానానికి ఎగబాకుతుంది. ఇక ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో.. భారత్, పాక్, ఆసీస్ తొలి మూడు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో, శ్రీలంక ఆరో స్థానంలో, దక్షిణాఫ్రికా ఏడో స్థానంలో కొనసాగుతున్నాయి.

కోహ్లిదే ఘనత :
ధోని సారథ్యంలో 2009లో టెస్టుల్లో అగ్ర స్థానానికి ఎగబాకిన టీమ్ ఇండియా.. ఎంతోకాలం ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు టీమ్ ఇండియా అగ్ర స్థానాన్ని చేరుకుందంటే.. అదంతా కోహ్లి కెప్టెన్సీ వల్లే అంటున్నారు క్రీడా పండితులు.
ఇప్పటికే రన్ మెషీన్ గా క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన కోహ్లి, కెప్టెన్ గాను సత్తా చాటడం టీమ్ ఇండియాకు మంచి పరిణామం. అయితే ఇదే నిలకడను టీమ్ ఇండియా ఇంకెంత కాలం కొనసాగిస్తుంది..? ఎన్నాళ్లు అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంటుందనేది? వేచి చూడాల్సిన అంశం.