Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ కోసం ఓ గేమ్ ప్లాన్‌: స్లెడ్జింగ్‌కు సై అన్న స్మిత్

ముంబై: ఆస్ట్రేలియా అంటేనే గుర్తొచ్చేది స్లెడ్జింగ్‌. ఒక‌ప్పుడు గ్రౌండ్‌లోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు నోటికి ప‌నిచెప్పే సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఆ జట్టు ఓటమి పాలవడంతో కాస్తంత దూకుడు త‌గ్గించారు. అయితే ఇప్పుడు ఊపు మీదున్న కోహ్లి సేన‌ను సొంత‌గడ్డ‌పై ఆస్ట్రేలియా ఎదుర్కోబోతున్న‌ది.

ఈ నేపథ్యంలో నోటికి ప‌నిచెప్పాల‌ని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది. మైదానంలో దూకుడుగా ఉండాల‌ని, నోటికి ప‌నిచెప్పాల‌ని ఇప్ప‌టికే ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్లేయ‌ర్స్‌కు ఆదేశాలిచ్చేశాడు. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత పర్యటనకు వచ్చిన స్టీవ్ స్మిత్ మంగళవారం మీడియాతో మాట్లాడాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం ఓ గేమ్ ప్లాన్‌ని సిద్ధం చేశామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వెల్లడించాడు. ఈసారి భారత పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు దూకుడుని ప్రదర్శిస్తుందని, అవసరమైతే కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాపై స్లెడ్జింగ్‌కు కూడా దిగుతుందని హెచ్చరించాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాతో తమకు కఠిన పరీక్ష ఎదురుకాబోతుందని చెప్పాడు.

ఈ సిరిస్‌లో కోహ్లీని కట్టడి చేసేందుకు తగిన ప్రణాళికతో ఇక్కడికి వచ్చినట్లు స్మిత్ తెలిపాడు. ఒక‌వేళ నోటికి ప‌నిచెబితేనే త‌మ అత్యుత్త‌మ ఆట బ‌య‌ట‌కు వ‌స్తుంద‌నుకుంటే దానికీ సిద్ధంగా ఉండండి అంటూ స్మిత్ ఆసీస్ ప్లేయ‌ర్స్ సూచించాడు. 'తమ జట్టులోని ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు స్లెడ్జింగ్ కూడా ఎంతో దోహదపడతుంది. ఇది వారిలో మెరుగైన ప్రదర్శనను రాబడుతుందంటే, అది అవసరమే కదా' అని స్మిత్ పేర్కొన్నాడు.

'భారత్‌తో పర్యటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఇది కచ్చితంగా మాకు భిన్నమైన సవాలే. భారత్ ఒక మంచి జట్టు. మేము కూడా భారత్ జట్టుకు గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నద్దమయ్యాం. ఈ పర్యటనలో మా ఆటగాళ్లు తప్పకుండా రాణిస్తారని ఆశిస్తున్నా' అని స్మిత్ చెప్పాడు.

మీ కెరీర్‌ల‌ను మ‌లుపు తిప్పే ఈ సిరీస్‌ను గెల‌వాల‌ని తన తోటి ప్లేయ‌ర్స్‌కు స్మిత్ పిలుపునిచ్చాడు. ఆసీస్ ఆటగాళ్లంతా దాని కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని స్మిత్ పేర్కొన్నాడు. ఇక్క‌డ సిరీస్ గెలిస్తే మా కెరీర్‌లు మ‌లుపు తిరుగుతాయని ముంబైలో మంగళవారం మీడియాతో స్మిత్ అన్నాడు.

కోహ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని కితాబిచ్చిన స్మిత్, నాలుగు టెస్టు సిరిస్‌ల్లో వరుసగా నాలుగు డబుల్ సెంచరీలు చేయడంపై ప్రశంసలు కురిపించాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు స్మిత్ తెలిపాడు.

రవిచంద్రన్‌ అశ్విన్‌‌ బౌలింగ్‌ను ఎదుర్కొనడంపై కూడా స్మిత్ స్పందించాడు. 'అశ్విన్‌ బౌలింగ్‌ను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధాటిగా ఎదుర్కొని బ్యాటింగ్‌ చేయడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాం. అతనొక ప్రపంచస్థాయి బౌలర్‌. అతని బౌలింగ్‌లో ఆడటం కష్టమే. కానీ మా బ్యాట్స్‌మెన్లకు ఎవరి వ్యూహాలు వారికున్నాయ'ని స్మిత్‌ చెప్పాడు.

ఇదిలా ఉంటే ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా జట్టు రెండో స్ధానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా చివరిసారిగా 2013లో భారత పర్యటనకు వచ్చి 4-0తో వైట్‌వాష్‌కు గురైంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+