
సిడ్నీ: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్ తండ్రయ్యాడు. మంగళవారం ఫించ్ సతీమణి అమీ ఫించ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చిన్న పాపకు ఎస్తేర్ కేట్ ఫించ్‌గా నామకరణం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకున్న ఫించ్.. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించాడు. విషయం తెలుసుకున్న సహచరులు, సన్నిహితులు ఫించ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఫాన్స్ కంగ్రాట్స్ చెపుతూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తతం ఆసీస్ టీ20, వన్డే జట్టుకు ఫించ్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే.
'ఎస్తేర్ కేట్ ఫించ్.. ఈ అందమైన ప్రపంచంలోకి నీకు స్వాగతం. మా చిన్నారి రాకుమారి నిన్న సాయంత్రం 4 గంటల 58 నిమిషాల సమయంలో జన్మించింది. తను 3.54 కిలోల బరువు ఉంది. అమీ ఫించ్, బేబీ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడికి నా కృతజ్ఞతలు' అని భార్యాబిడ్డలతో దిగిన ఫొటోలను ఆరోన్ ఫించ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఫించ్ ఆస్ట్రేలియా తరఫున 5 టెస్టులు, 132 వన్డేలు, 76 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 278, వన్డేల్లో 5232, టీ20ల్లో 2473 రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్లలలో కలిపి 19 సెంచరీలు (వన్డేల్లో 17, టీ20ల్లో 2) బాదాడు.
గాయాలతో సతమవుతున్న ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌లో మోకాలి గాయం కారణంగా వన్డే సిరీస్ ఆడలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆడలేకపోయాడు. మోకాలికి చికిత్స చేయించుకుంటున్న అతడు.. అంతా సవ్యంగా సాగితే అక్టోబరులో ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌నకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌పై నిషేధం పడడంతో ఫించ్ చేతికి టీ20, వన్డే పగ్గాలు అందాయి. మూడేళ్లుగా జట్టుకు అతడు నాయకత్వం వహిస్తున్నాడు. టెస్ట్ జట్టుకు టీమ్ పైన్ సారథ్యం వహిస్తున్నాడు.
87 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 2005 రన్స్ చేశాడు. గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఫించ్‌ను ఈ సీజన్లో ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. దీంతో ఈ సారి మెగా లీగ్‌ను అతను ఆడలేదు. గత సీజన్లో విఫలమవడంతో ఒక కోటి కనీస ధర ఉన్న అతడిని తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచులకు దూరమయిన ఆటగాళ్ల స్థానాల్లో కూడా అతడిని ఎవరూ తీసుకొలేదు.
ఆరోన్ ఫించ్ 2010 నుంచి ఐపీఎల్‌లో భాగంగా ఉన్నాడు. ఫించ్ మొదట రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడాడు. ఆ తర్వాత ఈ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ వివిధ ఇతర ఫ్రాంచైజీల . ప్రాతినిథ్యం వహించాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్), పూణే వారియర్స్ ఇండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఫించ్ ఆడాడు. ఐపీఎల్ 2021లో మాత్రం ఫించ్ ఆడట్లేదు.