మరికొన్ని రోజుల్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత జట్టు రెడీ అవుతోంది. గతేడాది ఫైనల్ చేరినా ట్రోఫీ నెగ్గలేకపోయిన భారత జట్టు ఈ సారి ఎలాగైనా ఈ ఐసీసీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటోంది. అదే సమయంలో ఆస్ట్రేలియా కూడా బలంగా కనిపిస్తోంది. పేస్‌కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్‌పై టీమిండియాను చిత్తు చేయాలని అనుకుంటోంది.
ఈ క్రమంలో ఆస్ట్రేలియా నెగ్గాలంటే ఎవరి వికెట్లు కీలకమో ఆ జట్టు మాజీ లెజెండ్ రికీ పాంటింగ్ చెప్పాడు. భారత స్టార్లు విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా ఇద్దరినీ ఎంత త్వరగా అవుట్ చేస్తే ఆస్ట్రేలియాకు అంత మంచిదని అభిప్రాయపడ్డాడు. 'ఆస్ట్రేలియా టీం మొత్తం విరాట్ గురించి మాట్లాడుకుంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అలాగే పుజారాను కూడా మర్చిపోకూడదు. వాళ్లిద్దరే కీలకం' అని పాంటింగ్ చెప్పాడు.

'పుజారా ఎప్పటి నుంచో ఆస్ట్రేలియా జట్టుకు పక్కలో బల్లెలా మారాడు. దానికితోడు ఇక్కడ పిచ్ కూడా దాదాపు ఆస్ట్రేలియా పిచ్‌లాగే ఉండబోతోంది. అలాంటి పిచ్‌పై పుజారాను ఆపడం కష్టం. అతన్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదని ఆస్ట్రేలియా టీంకు బాగా తెలుసు' అని పాంటింగ్ వివరించాడు. అలాగే కోహ్లీతో ఆసీస్ జట్టు చాలా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు.
'ఇక కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ ఆట చూస్తుంటే అతను ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. అతను దాదాపుగా తన బెస్ట్ ఫామ్ అందుకున్నట్లే. ఇప్పటి వరకు టీ20ల్లోనే అతను ఆడిన మాట నిజమే. కానీ నాతో మాట్లాడుతూ తన బెస్ట్ ఫామ్‌కు అడుగు దూరంలోనే ఉన్నట్లు ఫీలవుతున్నా అన్నాడు కోహ్లీ. ఇది కచ్చితంగా ఆసీస్‌కు వార్నింగ్ బెల్ వంటిదే. ఈ ఒక్క మ్యాచ్‌లో అతను చెలరేగితే కష్టం' అని వివరించాడు.
వీరికితోడు ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కూడా కంగారూలు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. గాయంతో కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌కు దూరమైన నేపథ్యంలో గిల్ ఈ మ్యాచ్ ఆడటం దాదాపు గ్యారంటీ. ఈ క్రమంలో అతను కూడా ఈ మ్యాచ్‌లో చెలరేగే అవకాశం ఉందని పాంటింగ్ అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టులో ఈ ముగ్గురే కీలకమైన బ్యాటర్లు అని ఈ లెజెండరీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.