
పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న ఆస్ట్రేలియా జట్టు ఇబ్బందుల్లో పడింది. ఇప్పటికే సూపర్ 12లో తొలి మ్యాచ్‌లో ఓడిందీ జట్టు. న్యూజిలాండ్ చేతిలో దారుణ పరాజయాన్ని చవిచూసింది. టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి దిగజారింది ఆసీస్. ఆసీస్ కంటే ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ పరిస్థితే మెరుగ్గా ఉంది. ఈ రెండు జట్ల నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంటోంది.
ఈ టోర్నమెంట్ రేస్‌లో నిల్చోవాలంటే ఈ సాయంత్రం జరిగే మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది ఆస్ట్రేలియా. పెర్త్‌లో షెడ్యూల్ అయిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించాల్సి ఉంటుంది. వనిందు హసరంగా, మహీశ్ తీక్షణ, ధనంజయ డిసిల్వా వంటి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనాల్సి ఉంటుంది. శ్రీలంక జట్టులో ఆస్ట్రేలియా కంటే మెరుగైన బౌలర్లు ఉన్నారు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ జోష్ హేజిల్‌వుడ్ బౌలర్లు ఉన్నప్పటికీ- న్యూజిలాండ్‌పై గెలవలేకపోయింది.
శ్రీలంకపై మ్యాచ్ గెలిచి తీరాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ట్రబుల్స్‌లో పడింది. ఆ జట్టు స్టార్ స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా శ్రీలంకతో మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అతనిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తోన్నట్లు జట్టు మేనేజ్‌మెంట్ పేర్కొంది. తేలికపాటి జ్వరం, దగ్గు, జలుబుతో అతను బాధపడుతున్నట్లు పేర్కొంది. ఆడమ్ జంపాకు రాపిడ్ యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించామని తెలిపింది.
నిజానికి- కోవిడ్ బారిన పడిన ప్లేయర్లు కూడా మ్యాచ్ ఆడటానికి అనుమతి ఇచ్చింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఐర్లాండ్ ఆల్‌రౌండర్ జార్జ్ డోక్రెల్- కోవిడ్ లక్షణాలతోనే శ్రీలంకపై మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జంపాలో కోవిడ్ ప్రారంభ లక్షణాలు మాత్రమే కనిపిస్తోన్నాయని, దాని తీవ్రత స్వల్పంగా ఉందని ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ పేర్కొంది. శ్రీలంకపై మ్యాచ్‌లో అతన్ని ఆడించాలా? వద్దా? అనే తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సింది బోర్డ్ అధికారులేనని వివరించింది.