
లండన్: పటిష్ట బయో బబుల్ వాతావరణంలో ఉన్నా కూడా ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెటర్లు వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఐపీఎల్ 2021 నుంచి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్‌మెన్ పీటర్ హ్యాండ్స్‌కబ్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతుండగా అతడికి వైరస్ సోకింది. కౌంటీ క్రికెట్లో మిడిలెక్స్‌కు హాండ్స్‌కాంబ్ సారథ్యం వహిస్తున్నాడు. కరోనా పాజిటివ్ అని తేలడంతో ఛాంపియన్‌షిప్ రెండో గ్రూప్ మ్యాచుకు అతడు దూరమయ్యాడు.
శనివారం మిడిలెక్స్ జట్టు ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించగా.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ పీటర్ హ్యాండ్స్‌కబ్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రిపోర్ట్ వచ్చిన వెంటనే అతడు ఐసోలేషన్‌కు వెళ్లిపోయాడు. అయితే అప్పటివరకు అతడితో పాటు ఆడిన మిడిలెక్స్ జట్టు ఆటగాళ్లు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. ఆదివారం లీసెస్టర్‌షైర్‌తో జరగాల్సిన మ్యాచుకు హ్యాండ్స్‌కబ్ దూరమయ్యాడు. హ్యాండ్స్‌కబ్ స్థానంలో టిమ్ ముర్తగ్ సారథిగా ఎంపికయ్యాడు. 'పీటర్ హాండ్స్‌కాంబ్ స్థానంలో ఐరిష్ ఆటగాడు టిమ్ ముర్తగ్ సారథిగా ఎంపికయ్యాడు. లీసెస్టర్‌షైర్‌తో పోరుకు అతడే నాయకుడిగా ఉంటాడు' అని మిడిలెక్స్ జట్టు యాజమాన్యం తెలిపింది.
పీటర్ హాండ్స్‌కాంబ్ గత కొన్నాళ్లుగా ఫామ్‌లో లేడు. మిడిలెక్స్ తరఫున అతడు హాఫ్ సెంచరీ చేసి 13 ఇన్నింగ్స్‌లు ముగిశాయి. ఆస్ట్రేలియా తరఫునా అతడిని ఎంపిక చేయడం లేదు. 2019 జనవరిలో చివరిగా ఆస్ట్రేలియా టెస్టు జట్టుకి ఆడిన పీటర్ హ్యాండ్స్‌కబ్.. అదే ఏడాది ఫిబ్రవరిలో భారత్‌పై బెంగళూరు వేదికగా చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత 2019 జులైలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అతను ఆడిన చివరి మ్యాచ్. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హ్యాండ్స్‌కబ్.. 16 టెస్టులు, 22 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెటర్లలో ముగ్గురు కరోనాతో బాధపడుతున్నారు. వారితో పాటు మరో నలుగురు సహాయ సిబ్బందికీ వైరస్ సోకింది. వీరితో ఇటీవల ఆడిన శ్రీలంక క్రికెటర్లు స్వదేశానికి వెళ్లగానే క్వారంటైన్ అయ్యారు. రెండు రోజులోనే బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేటా అనలిస్టు జీటీ నిరోషన్‌కు పాజిటివ్ వచ్చింది. అక్కడే మరో శిబిరంలో ఉన్న వేరే ఆటగాడికి వైరస్ సోకింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఆడుతున్న పీటర్ హాండ్స్‌కాబ్‌కు వైరస్ సోకడం ఆందోళనకు గురి చేస్తోంది. భారత జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బీసీసీఐ 20 రోజుల విశ్రాంతిని ఇచ్చిన నేపథ్యంలో కోహ్లీసేన అక్కడ చక్కర్లు కొడుతోంది.