
జట్టులోకి స్టార్ ప్లేయర్స్:
ఇటీవల వెస్టిండీస్ పర్యటనకి వ్యక్తిగత, భిన్నమైన కారణాలతో దూరమైన స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్, సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌కి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. యూఏఈ పిచ్‌లపై స్పిన్నర్ ఆడమ్ జంపా కీలకం కానున్నాడు. అతడు ఐపీఎల్ 2020లో రాణించిన విషయం తెలిసిందే. జంపాకు తోడుగా మాక్స్‌వెల్ కూడా స్పిన్ బౌలింగ్ పంచుకోనున్నాడు. మరో స్పిన్నర్ మిచెల్ స్వీప్సన్‌కి కూడా క్రికెట్ ఆస్ట్రేలియా చోటిచ్చింది. ఒకవేళ జంపా గాయపడితే.. ఆస్ట్రేలియా స్వీప్సన్‌కి తుది జట్టులో చోటు కల్పించనుంది.

పటిష్టంగా ఆస్ట్రేలియా:
డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, అరోన్ ఫించ్, మాథ్యూ వెడ్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టాయినిస్, అస్టన్ అగర్, గ్లెన్ మాక్స్‌వెల్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ మెరుగ్గా కనిపిస్తోంది. ఓపెనర్లు వార్నర్, ఫించ్ మంచి ఆరంభాన్ని ఇస్తే.. ఆ తర్వాత స్మిత్, మార్ష్, మాక్స్‌వెల్, స్టాయినిస్ చెలరేగనున్నారు. ఇక పేస్ దళాన్ని పాట్ కమిన్స్ ముందుండి నడిపించనున్నాడు. మిచెల్ స్టార్క్, జోస్ హేజిల్‌వుడ్, కేన్ రిచర్డ్‌సన్ అతడికి అండగా నిలవనున్నారు. బ్యాట్స్‌మన్ జోష్ ఇగ్లిష్ కూడా చోటు డాకించుకున్నాడు. మొత్తానికి ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.

అక్టోబరు 23న దక్షిణాఫ్రికాతో:
గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ ఉన్నాయి. గ్రూప్-ఎలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్, న్యూగినియా, పాపువా ఉన్నాయి. ఈ గ్రూప్-ఎ, గ్రూప్- బి జట్ల మధ్య అక్టోబరు 17 నుంచి 22 వరకూ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగనుండగా.. టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12 ( గ్రూప్-1, గ్రూప్-2) మ్యాచ్‌లకి అర్హత సాధించనున్నాయి. ఇక ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్‌ని అక్టోబరు 23న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. 30న ఇంగ్లండ్, నవంబరు 6న వెస్టిండీస్‌తో తలపడనుంది. క్వాలిఫయర్స్ నుంచి సూపర్-12లోకి రానున్న రెండు జట్లతో ఒక్కో మ్యాచ్‌ని ఆస్ట్రేలియా ఆడనుంది. సెప్టెంబర్ 19న యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 రెండో దశ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా జట్టు:
అరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇగ్లిష్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, అస్టన్ అగర్, మిచెల్ స్వీప్సన్, మాథ్యూ వెడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.


Click it and Unblock the Notifications












