ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్-ఏ జట్టుకు పేలవారంభం దక్కింది. 'ఆస్ట్రేలియా-ఏ'తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 47.4 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి నిరాశపరిచారు. ఓపెనర్ అభిమన్యు 30 బంతులు ఎదుర్కొని 7 పరుగులకే వెనుదిరిగాడు. ఆల్‌రౌండర్ నితీశ్ ఆరు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్-ఏ జట్టు ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గోల్డెన్ డకౌటయ్యాడు. జోర్డాన్ బకింగ్‌హమ్ వేసిన బంతిని షాట్‌కు యత్నించి వికెట్ కీపర్ జోష్ ఫిలిప్స్ చేతికి చిక్కాడు. కాసేపటికే అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్ కూడా పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంద్రజిత్ (9)తో కలిసి దేవదత్ పడిక్కల్ (36)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు.

వీరిద్దరు నాలుగో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. అయితే ఇంద్రజిత్ ఔటైన తర్వాత పెవిలియన్‌కు భారత బ్యాటర్లు క్యూ కట్టారు. ఆసీస్ బౌలర్ల ధాటికి 15 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే ఆఖర్లో నవదీప్ సైని (23) పోరాటంతో భారత్-ఏ జట్టు 100 పరుగుల మార్క్‌ను దాటింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రెండాన్ డాగెట్ ఆరు వికెట్లతో చెలరేగాడు. జోర్డాన్ బెకింగ్‌హమ్ రెండు వికెట్లు, ఫెర్గస్, టాడ్ ముర్ఫి తలో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-ఏ జట్టు నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు రెండు ఆడనుంది. రెండో మ్యాచ్ నవంబర్ 7న ప్రారంభం కానుంది. అయితే మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా-ఏ జట్టు 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ప్రసిధ్ కృష్ణ రెండు వికెట్లు, ముకేశ్ కుమార్ ఒక్క వికెట్ తీశారు. నితీశ్ రెడ్డి, అభిమన్యుతో పాటు ప్రసిధ్ కృష్ణ కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. నవంబర్ 22 నుంచి ఈ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే.