క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా జట్టు అంటే కేవలం అత్యుత్తమ ప్రదర్శన, అద్భుతమైన ఆటతీరు, దూకుడు మాత్రమే కాదు. వారి విజయాల వెనుక మైదానంలో వారు ప్రయోగించే మరొక శక్తివంతమైన అస్త్రం ఉంది - అదే స్లెడ్జింగ్.ఆస్ట్రేలియా జట్టు చరిత్రలో స్లెడ్జింగ్ ఓ అంతర్భాగం. ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను భగ్నం చేయడానికి, వారిని మానసికంగా దెబ్బతీయడానికి ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉపయోగించే మాటల దాడిని 'స్లెడ్జింగ్' అంటారు. ఇది వారి ఆటలో ఒక వ్యూహాత్మక ఆయుధంగా పనిచేస్తుంది. ఆస్ట్రేలియా జట్టు తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తాజాగా టీమిండియా ఆటగాళ్లను ఎక్కిరించింది. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆసియా కప్ 2025లో టీమిండియా ప్రదర్శించిన వైఖరి అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త వివాదానికి తెరతీసిన సంగతి తెలిసిందే. టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ చేయకూడదని తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ అంశాన్ని తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్లు వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. త్వరలో ఆస్ట్రేలియాలో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు కామెంట్స్ చేస్తున్న ఒక వీడియోను Kayo Sports అనే సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో భారత జట్టు హ్యాండ్‌షేక్ నిరాకరణపై ఆసీస్ ఆటగాళ్లు ఎగతాళిగా మాట్లాడటం విశేషం.

ఆసీస్ వ్యూహం ఏమిటి?
త్వరలో ఆస్ట్రేలియాలో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఈ వివాదాన్ని కవ్వింపులకు వాడుకున్నారు. వీడియోలో ఒక ఆసీస్ క్రికెటర్ మాట్లాడుతూ, "మనందరికీ తెలుసు, భారత జట్టు మా దేశానికి వస్తోంది. అయితే మేము వారిలో ఒక కీలకమైన బలహీనతను గుర్తించాం" అని పేర్కొన్నారు. మరో క్రికెటర్ స్పందిస్తూ, "హ్యాండ్‌షేక్ అంటే వారికి అంతగా ఇష్టం లేదని మాకు తెలుసు. కాబట్టి మేము ఒక బంతి వేయకముందే వారిని మానసికంగా ఆందోళనకు గురి చేయగలం" అని వ్యాఖ్యానించారు.
ఇలా, హ్యాండ్‌షేక్‌ను ఒక 'బలహీనత'గా చిత్రించి, భారత ఆటగాళ్లను కలవడానికి తాము ఎలాంటి కొత్త తరహా 'గ్రీటింగ్స్' ప్రయత్నించవచ్చో సూచిస్తూ ఆసీస్ ప్లేయర్లు సరదాగా స్పందించారు. ఈ వీడియో భారత అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మంచి ఫామ్‌లో ఉన్న భారత జట్టు ఏకాగ్రతను భంగం చేయడానికి ఆస్ట్రేలియా ఈ 'మానసిక యుద్ధాన్ని' మొదలుపెట్టిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
స్లెడ్జింగ్: ఆసీస్ 'దూకుడు'కు నిదర్శనం
ఆస్ట్రేలియా జట్టు తరచుగా స్లెడ్జింగ్‌ను ఉపయోగించడానికి కారణాలు ఉన్నాయి. ప్రత్యర్థి ఆటగాడిని మాటల ద్వారా ఒత్తిడికి గురిచేసి, వారు తొందరపడి వికెట్ కోల్పోయేలా చేస్తారు.మైదానంలో తమ దూకుడును నిరంతరం ప్రదర్శించడం ద్వారా, తాము ఎప్పుడూ పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తామని ప్రత్యర్థికి స్పష్టం చేస్తారు.ఈ తాజా వీడియో ద్వారా కూడా ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ సాంప్రదాయ కవ్వింపులను ప్రారంభించారు. రాబోయే సిరీస్‌ను మరింత ఆసక్తికరంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ ?
ఇదిలా ఉండగా.. భారత జట్టుతో కీలక పోరుకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కోసం తీవ్రంగా పోరాడుతున్నాడు. తాజాగా అతనికి నిర్వహించిన స్కాన్లలో అతడి వెన్నుగాయం ఇంకా నయం కాలేదని వెల్లడైంది. కొన్ని వారాలుగా ఆటకు దూరంగా ఉన్న 32 ఏళ్ల కమిన్స్.. నవంబర్ 21న ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మక 'యాషెస్' సిరీస్‌లోని మొదటి టెస్టులో ఆడటం కష్టమని తెలుస్తోంది.