
హైదరాబాద్: ఆస్టేలియా సరికొత్త రికార్డును నమోదు చేసింది. టీ 20ల్లో ప్రపంచంలోనే టాప్ స్థానంలో నిల్చొంది. న్యూజిలాండ్‌తో జరిగిన ట్రైసిరీస్ మ్యాచ్‌లో ఏకంగా 244 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి సంచలనం సృష్టించింది. కేవలం 18.5 ఓవర్లలోనే 5 వికెట్లు నష్టపోయి ఇంత పెద్ద లక్ష్యాన్ని సాధించింది.
ఈ మ్యాచ్ మొత్తంలో 32 సిక్సర్లు నమోదు కావడం విశేషం. ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు సమమైంది. గతంలో టీ20ల్లో సక్సెస్‌ఫుల్ చేజ్ 236 పరుగులతో వెస్టిండీస్ పేరిట ఉంది. ఆ రికార్డును ఆస్ట్రేలియా 244 పరుగుల చేజింగ్‌తో దాటేసింది.
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 24 బాల్స్‌లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 రన్స్ చేశాడు. మరో ఓపెనర్ డాన్సీ షార్ట్ 44 బాల్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. వీళ్లకు తోడు మాక్స్‌వెల్ (14 బంతుల్లో 31), చివర్లో ఫించ్ (14 బంతుల్లో 36) మెరుపులు మెరిపించడంతో వరల్డ్ రికార్డు స్కోరు విజయవంతంగా ఛేదించగలిగింది.
అంతకుముందు ఓపెనర్ మార్టిన్ గప్టిల్ సెంచరీతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 243 పరుగులు చేసింది. గప్టిల్ కేవలం 54 బాల్స్‌లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో 105 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ మన్రో (33 బంతుల్లో 76) కూడా చెలరేగిపోయాడు.
మన్రో 6 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 132 పరుగులు జోడించారు. వీళ్ల జోరు చూస్తూ న్యూజిలాండ్ టీ20ల్లో రికార్డు స్కోరు సాధించేలా కనిపించినా.. చివర్లో తడబడి 243 పరుగులకే పరిమితమైంది.