AUS vs BAN: మెరిసిన జంపా, ఫించ్.. 6 ఓవర్లలోనే బంగ్లాపై ఆస్ట్రేలియా విజయం! రెండో స్థానంపై కన్ను!

దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచింది. 74 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 6.2 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ ఇద్దరే ఆస్ట్రేలియాను గెలిపించారు. వార్నర్ 14 బంతుల్లో 18 పరుగులు చేయగా.. ఫించ్ 20 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ ఆడమ్ జంపాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.

చెలరేగిన ఫించ్:
స్వల్ప లక్ష్య ఛేదనను ఆసీస్ ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (40), డేవిడ్ వార్నర్ (18) ధాటిగా ఆరంభించారు. ఒకవైపు సింగిల్స్ తీస్తూనే.. మరోవైపు బౌండరీలు బాదారు. ముఖ్యంగా ఫించ్ నాలుగు సిక్సులు బాదాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే ఇద్దరిని స్వల్ప వ్యవధిలో ఔట్ చేయడం మినహా బంగ్లా బౌలర్లు సాధించేదేమీ లేదు. అనంతరం వచ్చిన మిచెల్ మార్ష్ (16 నాటౌట్), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0) మరో వికెట్ పడనీయకుండా 78 పరుగులు చేసి లక్ష్యాన్ని పూర్తి చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, ఇస్లామ్ చెరో వికెట్ పడగొట్టారు.

వణికించిన ఆడమ్ జంపా:
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 15 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌట్ అయింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఏదీ కలిసిరాలేదు. తొలుత మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఇబ్బంది పడిన బంగ్లా బ్యాటర్లు.. తర్వాత వచ్చిన ఆడమ్ జంపా (5/19) దెబ్బకు కుదేలయ్యారు. వెంటవెంటనే వికెట్లను కోల్పోయి ఒక్కరూ క్రీజ్‌లో నిలబడలేకపోయారు. బంగ్లా బ్యాటర్లలో నలుగురు డకౌట్‌గా వెనుదిరిగారు. లిటన్ దాస్, హుస్సేన్, హసన్, ఇస్లామ్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరారు. మిగతావారిలో నయీమ్ 17, సౌమ్య సర్కార్ 5, ముష్ఫికర్ రహీమ్ 1, మహమ్మదుల్లా 16, షమీమ్ 19, తస్కిన్ 6, ముస్తాఫిజర్ 4 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో జంపా 5, స్టార్క్ 2, హేజిల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టారు.

సెమీస్ అవకాశాలు మరింత మెరుగు:
బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. సూపర్ 12 గ్రూప్-1 నుంచి ఇప్పటికే ఇంగ్లండ్ (8) సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం నాలుగేసి మ్యాచుల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో దక్షిణాఫ్రికా (6), ఆస్ట్రేలియా (6) పోటీ పడుతున్నాయి. అయితే ఉత్తమ రన్‌రేట్‌తో ఆసీస్ రెండో స్థానానికి చేరుకుంది. ఇక తమ ఆఖరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా -ఇంగ్లండ్, ఆస్ట్రేలియా-వెస్టిండీస్ జట్లు తలపడతాయి. రెండో స్థానం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఒక్క విజయం లేకుండానే బంగ్లాదేశ్ (0) ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications