కోల్‌కతా: ప్రపంచ టీ20 టోర్నీలో శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా విజయం సాధించడం పట్ల స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. టీమిండియా విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
కాగా, తను చిన్నతనం నుంచి స్ఫూర్తి పొందిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ముందు ఆడటం మరికొంత ఉత్సాహాన్ని, ఆనందాన్నిచ్చిందని తెలిపాడు. తాను ఆడుతున్న మ్యాచును సచిన్ చూడటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు.
'ఎదురుగా దాదా(మాజీ కప్టెన్ సౌరవ్ గంగూలీ) అన్నయ్య ఉన్నాడు. స్టాండ్స్‌లో సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఇండియా కోసం సచిన్ ఏం చేశారో.. సచిన్ కోసం అభిమానులు ఎంతగా కేకలు పెడతారో నా చిన్నతనం నుంచి చూస్తూ వచ్చాను' అని కోహ్లీ పేర్కొన్నాడు.
చాలాకాలం తర్వాత తనకు సచిన్ ముందు ఆడే గొప్ప అవకాశం వచ్చిందని, తన ఆటను చూస్తూ ఆయన ఉత్సాహంగా గడపడం చూశానని అన్నాడు. సచిన్‌నే ఆదర్శంగా తీసుకొని క్రికెట్‌లో అడుగుపెట్టిన తనలాంటి యువ క్రీడాకారుడికి సచిన్ ముందే ఆడుతున్న క్షణంలో ఆ ఫీలింగ్స్ వర్ణించడం సాధ్యం కాదని అన్నాడు.
సచిన్ ముందే ఆడుతూ, ఆయనకు గొప్పసంతోషాన్నివ్వగలగడం గొప్ప అనుభూతి అని, భావోద్వేగంతో నిండిన సందర్భం అని చెప్పారు. కాగా, పాకిస్థాన్‌పై భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ.. అర్థ శతకం పూర్తి చేసిన అనంతరం సచిన్ టెండూల్కర్ చూస్తూ తలవంచి అభివాదం చేశారు. అంతేగాక, తన అర్ధ శతకం సచిన్‌కు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు.