చెన్నై: ఆస్టేలియా ఎడమ చేతి వాటం చైనామ్యాన్ బౌలర్ బ్రాడ్ హాగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రికార్డుని నెలకొల్పాడు. ఏప్రిల్ 28న చెన్నైలోని ఎమ్ చిదంబరం స్డేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ Vs కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డుని సాధించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అతి పెద్ద వయస్కుడిగా ఆడిన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్ హాగ్ వయస్సు 44 సంవత్సరాలు 81 రోజులు. వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా సునీల్ నరేన్ తుది జట్టులో స్ధానం కోల్పోవడంతో అతని స్ధానంలో కోల్‌కత్తా తుది జట్టులో స్ధానం లభించింది.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలం పాటలో బ్రాడ్ హాగ్‌ని కోల్‌కత్తా నైట్ రైడర్స్ రూ 50 లక్షలకు కొనుగోలు చేసింది. అంతక ముందు ఐపీఎల్‌లో రాజస్ధాన్ రాయల్స్ జట్టు తరుపున ఐపీఎల్‌లో ఆడారు. మంగళవారం ఆడక ముందు బ్రాడ్ హాగ్ ఐపీఎల్‌లో 2013లో ఆడారు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కుడు, పెద్ద వయస్కుడు రికార్డులను నెలకొల్పారు. ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకి చెందిన సర్ఫరాజ్ ఖాన్ (17 సంవత్సరాలు) పిన్న వయస్కుడుగా రికార్డు సాధించాడు.
చెన్నైలోని ఎమ్ చిదంబరం స్టేడియంలో టాస్ సమయంలో కోల్‌కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్, తుది జట్టులో బ్రాడ్ హాగ్ ఆడుతున్నారనే విషయాన్ని చెప్పడంతో, మాజీ ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు అతనికి అభినందనలు తెలిపారు.
ఆస్టేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ తన ట్విట్టర్ పేజిలో బ్రాడ్ హాగ్‌పై ట్వీట్ చేశాడు.