
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న కోహ్లీ సేనకు విజయం ఖాయమట. అంతేకాదు ఆ తర్వాత జరగనున్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో సైతం విజయం వరిస్తుందంటూ నొక్కి చెప్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు.
నాగ్‌పూర్‌లో ఉండే నరేంద్ర బుందె ప్రముఖ క్రికెటర్లకు జ్యోతిష్యం చూసి సూచనలిస్తుంటారు. అంతేకాదు గతంలో ఆయన చెప్పిన సంగతులు కూడా కొన్ని నిజమైయ్యాయట. దీంతో కోహ్లీకి కూడా గ్రహానుకూలత బాగుందని ఆయనకు కూడా విజయం వరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
గతంలోనూ..సచిన్ టెండూల్కర్‌కు భారత రత్న రానుందని, గంగూలీ మళ్లీ క్రికెట్‌లోకి వస్తాడని, 2011 భారత ప్రపంచ కప్ గురించి చెప్పిన అన్ని విషయాలు నిజమైయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'అందరూ వ్యతిరేకిస్తున్నా నేను ధోనీకి మంచి భవిష్యత్తు ఉందంటూ ముందే చెప్పాను. చూడండి గడిచిన నాలుగు నెలల నుంచి ధోనీ మళ్లీ ఎలా రాణిస్తున్నాడో' అని ప్రశ్నించారు.
ఇంకా ఈయన దగ్గరు గంగూలీ, మురళీ కార్తీక్, శ్రీశాంత్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, సురేశ్ రైనాలు సైతం క్రికెట్ గురించి సలహాలు తీసుకున్నారు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు యజమాని అయిన ప్రీతిజింతా కూడా జట్టు మొదలుపెట్టే ముందు ఈయన్నే సంప్రదించింది.
గతేడాది జరిగిన ఐసీసీ మహిళా ప్రపంచ కప్‌లో జట్టుకు సారథ్యం వహించిన మిథాలీ రాజ్ సైతం ఈయన సూచన మేరకే 33వ నంబరున్న టీషర్టును ధరించిందట. కొద్ది రోజుల క్రితం జరిగిన రంజీ ట్రోఫీలో సైతం విదర్భ విజయం సాధిస్తోందని బుందె ముందే చెప్పారట.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.