ఇంచియాన్: దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు శ్రీలంక క్రీడాకారులు అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. శ్రీలంక హాకీ క్రీడాకారుడు ప్రసన్న దిననాయకే, మరో బీచ్ వాలీబాల్ క్రీడాకారుడు గత శనివారం రాత్రి నుంచి కనిపించుకుండా పోయినట్లు అధికారులు తెలిపారు.

వారు అదృశ్యమయ్యారా లేదంటే ఉద్యోగం కోసం కావాలనే కనిపించకుండా పోయారా అనే విషయాన్ని అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దక్షిణ కొరియాలో శ్రీలంకకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇంచియాన్‌లో జరిగిన 17వ ఆసియా క్రీడల కోసం 60 మంది పురుషులు, 20 మంది మహిళలను శ్రీలంక దేశం పంపించారు.
బీచ్ వాలీబాల్ క్రీడాకారుడు ఎవరనేది ఇంకా గుర్తించలేదు. అతను సాయుధ బలగాల సభ్యుడని భావిస్తున్నారు. జర్మనీలో 2004లో జరిగిన శ్రీలంక హ్యాండ్ బాల్ జట్టు కనిపించకుండా పోయింది. అయితే 23 మంది సభ్యుల ఆ జట్టు అధికారిక జట్టు కాదని తేలింది.