
ఢాకా: బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబూర్ రెహ్మాన్ శతజయంతిని పురస్కరించుకుని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) టీ20 మ్యాచ్‌లను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రెహ్మాన్ శతజయంతి సందర్భంగా ఆసియా ఎలెవన్, ప్రపంచ ఎలెవన్ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లను మార్చిలో నిర్వహించాలని బీసీబీ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లకు ఐసీసీ కూడా సానుకూలంగా స్పందించింది. మ్యాచ్ షెడ్యూల్, ఆసియా ఎలెవన్ జట్టు వివరాలను పంపించాలని బీసీబీని ఐసీసీ కోరింది.
భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితల దృష్ట్యా రెండు దేశాలకు చెందిన క్రికెటర్లు ఒకే జట్టులో ఉండటం అసాధ్యం. ఇది జరగని పని కాబట్టి.. పాకిస్తాన్ కంటే తమకు భారతే ముఖ్యమనే భావనలో బీసీబీ ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి జయేశ్ జార్జ్ మాట్లాడుతూ... 'మాకు అందిన సమాచారం ప్రకారం ఆసియా ఎలెవన్ జట్టులో పాకిస్తాన్ ఆటగాళ్లు లేరని తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత్-పాకిస్తాన్ దేశాల ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడే అవకాశం లేదు' అని అన్నారు.
'భారత్-పాకిస్తాన్ ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడాల్సి వస్తే.. ఈ విషయంపై బీసీసీఐ ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆసియా ఎలెవన్ జట్టులో భారత్ నుంచి ఐదుగురు క్రికెటర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ ఐదుగురిని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎంపిక చేస్తారు' అని జయేశ్ జార్జ్ తెలిపారు.
ఎప్పటినుంచో సంబంధాలు సరిగాలేని భారత్-పాక్ దేశాల మధ్య పుల్వామా ఉగ్రదాడి అనంతరం మరింత ఉద్రిక్త పరిస్థుతులు నెలకొన్నాయి. ఈ ఒక్క ఘటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. మరోవైపు పాక్ బోర్డు నేతలు భారత్‌పై విషం చిమ్ముతూనే ఉన్నారు. తాజాగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ విజయవంతం కావడంతో పీసీబీ చైర్మన్ ఎహ్‌సాన్ మణి వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. రక్షణ పరంగా భారత్ కంటే పాక్ ఎంతో నయమని వ్యాఖ్యానించాడు.
'పాక్‌లో క్రికెట్ ఆడటం ప్రమాదకరం కాదని నిరూపించాం. ఒకవేళ ఏ జట్టైనా మా పర్యటనకు రాకపోతే.. ఇక్కడ భద్రతాపరమైన ప్రమాదం పొంచి ఉందని నిరూపించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్థాన్ కన్నా భారతే చాలా ప్రమాదకరంగా ఉంది. భారత్‌కు వెళ్లి క్రికెట్ ఆడటానికి లేని భయం పాక్ రావడానికి ఎందుకు?' అని మణి ప్రశ్నించాడు. దీనిపై బీసీసీఐ కూడా గట్టిగానే బదులిచ్చింది. భారత అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించింది.