
ఆసియా కప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ టిక్కెట్ల సేల్స్ డేట్స్ వచ్చేసింది. ఆగస్టు 15న (సోమవారం) సేల్స్ స్టార్ట్ కానున్నాయి. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఇటీవల ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్‌లు మధ్య జరగనుంది. ఆగస్టు 27న ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఆగస్టు 28న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఇకపోతే ఇప్పటికే భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ టోర్నీకి అర్హత సాధించగా.. యుఏఈ, కువైట్, సింగపూర్, హాంకాంగ్ జట్లు క్వాలిఫయర్స్ ఆడాల్సి ఉంది. వీటిలో ఓ జట్టు తుది ఆసియా కప్ టోర్నీకి 6వ జట్టుగా ఎంపికవుతుంది.
'ఆసియా కప్ - 2022 మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయాలు ఆగస్టు 15న అమ్మకానికి వస్తాయి. మీ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి సోమవారం నుండి కింది లింక్‌ను సందర్శించండి" అని ఏసీసీ ట్వీట్ చేసింది. మొత్తం షెడ్యూల్‌తో పాటు platinumlist.net అనే లింక్ ప్రొవైడ్ చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్ నెదర్లాండ్స్ జట్టుతో వన్డే సిరీస్ ఆడ్డానికి సిద్దమైంది. అదేవిధంగా జింబాబ్వేతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ కనిపించనుంది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌తో పాటు ప్రముఖ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ చాలా కాలం తర్వాత ఈ సిరీస్లో భారత జట్టులోకి తిరిగి వచ్చారు.

ఆసియాకప్ ఈ సంవత్సరం శ్రీలంకలో ఆడవలసి ఉంది. అయితే శ్రీలంకలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆహార కొరత కారణంగా, టోర్నమెంట్‌ను యుఏఈకి మార్చాలని నిర్వాహక కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న 2022 టీ20 ప్రపంచకప్‌కు ట్రైలర్ లాంటి టోర్నీ కావడంతో అన్ని జట్లు ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని చూస్తున్నాయి.